ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ దిగ్గజ సంస్థ వాట్సాప్‌ త్వరలో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నది. వినియోగదారులు ఈ ఫీచర్‌ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాత్రి వేళ్లలో డార్క్ మోడ్‌లో వాట్సాప్ మెసేజ్‌లు తేలిగ్గా చూసుకునేందుకు వెసులుబాటుగా ఉంది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ కావాలనుకున్నవారు చాట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగు థీమ్‌ ఎంపిక చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉంది.

ఈ నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశ పెట్టడానికి కొన్ని నెలలుగా వాట్సాప్‌ ప్రయత్నిస్తోందని, ఈ నెలాఖరులో గానీ,  వచ్చే నెల తొలివారంలో గానీ వాట్సాప్ డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వాబెటా ఇన్ఫో ధ్రువీకరించింది. 

డార్క్‌మోడ్‌ వల్ల అక్షరాలు ప్రకాశవంతంగా బ్యాక్‌గ్రౌండ్‌ నలుపు రంగులోకి మారిపోతాయి. దీనివల్ల కళ్లకు అంతగా శ్రమ ఉండదు. అంతేకాక బ్యాటరీ కూడా ఎక్కువ సమయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవలే గూగుల్‌ కూడా డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. విండోస్ 10 పీసీలు, నోట్‌బుక్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులో ఉన్నది. యాపిల్ ఐఫోన్లలో ఐఓఎస్ 10తోపాటు మాక్ ఓఎస్ మొజావె కంప్యూటర్లలో వాట్సాప్‌లో డార్క్‌మోడ్ ఫీచర్ ఏర్పాటైంది. 

తెలుపు రంగులో బ్యాక్‌గ్రౌండ్‌ ఉండే నార్మల్‌ మోడ్‌తో పోల్చితే డార్క్‌మోడ్‌ వల్ల 43శాతం వరకూ బ్యాటరీ శక్తి తక్కువ ఖర్చవుతుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే గూగుల్‌కు చెందిన యూ ట్యూబ్‌, మ్యాప్స్‌ వంటి యాప్‌లలో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. వాట్సాప్‌ తర్వాత అతి పెద్ద మెసేజ్‌ ప్లాట్‌ఫాం అయిన ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ కూడా త్వరలో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.