భారత్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘షేర్‌‌చాట్‌’ యాప్‌ 50వేల ప్రొఫైళ్లను తొలగించింది. సోషల్ మీడియాలో అశ్లీలం, హింస, ద్వేషం, మోసపూరిత వ్యాఖ్యలు, అసత్య వార్తలను జొప్పిస్తున్న వినియోగదారులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు యాప్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. 

భారత్‌లో 14 స్థానిక భాషల్లో షేర్‌చాట్‌ను వినియోగిస్తున్నారు. అందులో హిందీ, తమిళ్‌, తెలుగు, మరాఠీ, ఒరియా, అస్సామీ, బెంగాలీ, కన్నడ, గుజరాతీ భాషల్లో షేర్ చాట్ వినియోగిస్తున్నారు. నెలకు దాదాపుగా 35 మిలియన్ల వినియోగదారులు ఈ యాప్‌ను వినియోగిస్తున్నట్లు ఓ అంచనా. 

ఈ ప్రొఫైళ్లను తొలగించేందుకు షేర్‌చాట్‌ తొలుత వినియోగదారులకు అవగాహన కల్పించింది. అశ్లీలంగా, అనుమానాస్పదంగా, సమస్యలు సృష్టించేవిగా ఉండే ప్రొఫైళ్లపై తమకు నివేదించాలని కోరింది. ప్రత్యేకించి ఇటీవల జత కలిసిన ఈశాన్య రాష్ట్ర భాషల్లో సమస్యాత్మక సమాచారం చాటింగ్ చేస్తున్న వారి వివరాలు అందజేయాలని అభ్యర్థించింది. 

యాప్‌ వినియోగదారులందరికీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని,  ఉద్దేశపూర్వకంగానే సమ్మతంకాని చర్యలకు ఉపక్రమిస్తున్నవారి అకౌంట్లను నిషేధించామని ‘షేర్‌చాట్‌’ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఫరీద్‌ ఆసన్‌ తెలిపారు. ఏదైనా కంప్లయింట్ అందితే దాన్ని వెంటనే తొలగించకుండా నిపుణుల బృందం పరిశీలించిన తర్వాతే వాటిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

విదేశాలకు చెందిన సంస్థలు, నిపుణుల ద్వారా సమాచారం, అక్కడ అమలు చేస్తున్న ఉత్తమ పద్దతులను తెలుసుకుని ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ‘షేర్‌చాట్‌’ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఫరీద్‌ ఆసన్‌ చెప్పారు.

క్రుత్రిమ మేధస్సును అభివ్రుద్ధి చేయడం ద్వారా ఫేక్ న్యూస్ నియంత్రణపై ద్రుష్టి పెట్టామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో ప్రతిపాదించిన సవరణలపై తాను స్పందించలేనన్నారు. సమస్యాత్మక అంశాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో సహకరిస్తున్నట్లు చెప్పారు. 

సమస్యాత్మకమైన వ్యక్తుల చాటింగ్, వ్యవహార శైలిని తరుచుగా నియంత్రించడం కష్టసాద్యమేనని మిషి చౌదరి అనే న్యాయవాది పేర్కొన్నారు. అయితే నియంత్రణను భారతదేశంలో ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.