Asianet News TeluguAsianet News Telugu

మన స్పెక్ట్రం చాలా కాస్ట్‌లీ! అమెరికాకంటే ఎక్కువే!!

వంద రోజుల్లో 5జీ స్పెక్ట్రం ట్రయల్స్ ప్రారంభిస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. అయితే స్పెక్ట్రం ధర అమెరికా, దక్షిణ కొరియా దేశాలకంటే 30-40 శాతం ఎక్కువగా ఉన్నదని సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న టెలికం ఆపరేటర్లు భారీ స్పెక్ట్రం ధరను భరించగలరా? లేదా? అన్నదే సందేహం.

Price of 5G spectrum in India 30-40 percent higher than global rates
Author
New Delhi, First Published Jun 5, 2019, 11:04 AM IST

న్యూఢిల్లీ: ఈ ఏడాది మెగా స్పెక్ట్రం వేలానికి సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 5జీ రేడియో తరంగాల ధర చాలా ఎక్కువని టెలికం పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. భారత్‌లో 5జీ స్పెక్ట్రమ్‌ ధర దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలతో పోల్చితే 30 నుంచి 40 శాతం అధికంగా ఉన్నట్టు దేశీయ టెలికాం పరిశ్రమ భావిస్తోంది. 

ఈ ఏడాది చివరిలోగా 5జీ స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహిస్తామని, 100 రోజుల్లో 5జీ ప్రయోగాత్మక పరీక్షలు కూడా ప్రారంభిస్తామని టెలికాం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ స్పందన వచ్చింది. 5జీ స్పెక్ట్రమ్‌ ధరలు భరించలేనంత ఎక్కువని, తమ ఆర్థిక స్థితి తలకిందులు అవుతుందని పలువురు ఆపరేటర్లు భావిస్తున్నట్టు సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ చెప్పారు. 

5జీ సేవలు దేశంలో సామాజిక లక్ష్యాలను కూడా నెరవేర్చేలా స్పెక్ట్రమ్‌ ధరలో ప్రోత్సాహకాలివ్వాలని కేంద్రాన్ని సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ కోరారు. 5జీ స్పెక్ట్రం హేతుబద్ధమైన ధరలకు అందుబాటులో ఉంచాలని, పన్నులు, సుంకాలు కూడా తక్కువగా నిర్ణయించాలని వొడాఫోన్‌ ఐడి యా సీఈఓ, సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం కొత్త అధ్యక్షుడు బాలేశ్‌ శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

5జీసహా ఇతర రేడియో తరంగాలకు వినియోగించే స్పెక్ట్రంను త్వరలోనే వేలానికి తేనున్నట్లు టెలికం శాఖ కొత్త మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ స్పందిస్తూ ‘స్పెక్ట్రం కనీస సిఫారసు ధర చాలా ఎక్కువగా ఉన్నది. దీన్ని మేము భరించలేం’ అని అన్నారు.

సరిపడా స్పెక్ట్రం అందుబాటులో ఉందన్న టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దాదాపు 8,644 మెగాహెట్జ్ టెలికం ఫ్రీక్వెన్సీలను వేలానికి సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. ఇందులో 5జీ సర్వీసులు కూడా ఉన్నాయని, స్పెక్ట్రం కనీస ధర రూ.4.9 లక్షల కోట్లుగా ఉండొచ్చని చెప్పారు.

ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీయ టెలికం రంగం 5జీ స్పెక్ట్రం కొనుగోలుపై ఆసక్తి చూపుతుందా? లేదా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

సీవోఏఐ తాజా స్పందన ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. అన్ని టెలికం సంస్థలకు అందుబాటులో ఉండేలా 5జీ స్పెక్ట్రం ధరలను నిర్ణయించాలని సీవోఏఐ నూతన చైర్మన్, వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేశ్ శర్మ కూడా మోదీ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. గత వారం భారతీ ఎయిర్‌టెల్ సైతం ట్రాయ్ సిఫార్సు చేసిన ధరలు అన్యాయమని, చాలా ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరం తెలిపింది.

స్పెక్ట్రం ధరపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉందని కూడా భారతీ ఎయిర్ టెల్ అభిప్రాయపడింది. తీవ్ర ఒత్తిడిలో నడుస్తున్న దేశీయ టెలికం రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై దృష్టి సారిస్తానని, సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెబుతున్న క్రమంలో ఆ దిశగా అడుగులు వేయాలని పరిశ్రమ కోరుతున్నది. 

టెలికం రంగంలోకి రిలయన్స్ జియో రాకతో చోటుచేసుకున్న చార్జీల యుద్ధం వల్ల చాలా టెలికం సంస్థలు ఇప్పుడు నష్టాల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, 5జీ ట్రయల్స్‌తోపాటు దేశీయ మార్కెట్ వాస్తవికతను ప్రతిబింబించేలా ఓ బ్రాడ్‌బాండ్ సంసిద్ధత సూచీ ఏర్పాటు, 5 లక్షల వై-ఫై హాట్‌స్పాట్‌ల ఫాస్ట్-ట్రాకింగ్, దేశంలో టెలికం ఉత్పాదకతకు ప్రోత్సాహం, హై-స్పీడ్ ఇంటర్నెట్, మౌలిక సదుపాయాలు వంటివి ప్రసాద్ ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios