Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్లలో డిజిటల్‌ ప్రొఫెషనల్స్ షార్టేజ్.. నాస్కామ్ ఆందోళన

వచ్చే ఐదేళ్లలో డిజిటల్ నిపుణుల కొరత ఏర్పడనున్నదని ఐటీ ఇండస్ట్రీ బాడీ ‘నాస్కామ్’ అంచనా వేస్తోంది. దీన్ని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయానీ ఘోష్ తెలిపారు. 

Need for 2.7mn digitally skilled people by 2023
Author
Chennai, First Published Jul 18, 2019, 2:41 PM IST

చెన్నై: కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), డేటా అనలిటిక్స్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీల నిపుణులకు గిరాకీ భారీగా పెరగనున్నది. వచ్చే ఐదేళ్లలో డిజిటల్‌ టెక్నాలజీ నిపుణుల లభ్యత పరిశ్రమకు సవాల్‌ కానుందని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) భావిస్తోంది. 


ప్రస్తుతం దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో దాదాపు 40 లక్షల మంది నిపుణులు పని చేస్తున్నారని.. 2023 వరకూ పరిశ్రమలో డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యాలు గల నిపుణుల డిమాండ్‌ ఏడాదికి 35 శాతం మేరకు పెరగనుందని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవ్‌యానీ ఘోష్‌ తెలిపారు.
 
ప్రస్తుతం పరిశ్రమలో పని చేస్తున్న నిపుణులకు డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యాలను కల్పించడానికి (రీస్కిల్‌) నాస్కామ్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ దిశగా పలు చర్యలు చేపట్టిందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్ యానీ ఘోష్ పేర్కొన్నారు. తొలి చర్యగా విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. 

‘డిజిటల్‌ నైపుణ్యాల కొరత కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. కొత్త వారికి ఈ టెక్నాలజీల్లో నైపుణ్యాలను అందించడంతోపాటు ఇప్పటికే పరిశ్రమలో ఉన్న వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించాలని నాస్కామ్‌ భావిస్తోంది. ప్రస్తుతం పరిశ్రమలో పని చేస్తున్న 40 లక్షల మంది నిపుణుల్లో 60-65 శాతం మంది జాబ్‌ ప్రొఫైల్స్‌ వచ్చే అయిదేళ్లలో మారనున్నాయి.

2022 నాటికి 54 శాతం మంది ఉద్యోగులు డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది’ అని దేవయానీ ఘోష్ పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ ఏడాదిలో దాదాపు 30 విశ్వవిద్యాలయాలతో నాస్కామ్‌ ఒప్పందాలు కుదుర్చుకోనుంది. తొలి ఒప్పందం చెన్నైకి చెందిన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంతో కుదుర్చుకుందని ఘోష్‌ అన్నారు.

నాస్‌కామ్‌కు చెందిన భవిష్యత్‌ నైపుణ్యాల అధిపతి కీర్తి సేథ్‌ మాట్లాడుతూ.. నాస్‌కామ్‌ గత ఏడాది కొత్త తరం టెక్నాలజీపై దృష్టి పెట్టిందని, ఈ ఏడాది నిపుణుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచడానికి కృషి చేస్తోందన్నారు.
 
బిగ్‌ డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధ వంటి టెక్నాలజీల్లో నైపుణ్యాలతోపాటు సమస్యను పరిష్కరించడం, స్టోరీ టెల్లింగ్‌, చర్చా సామర్థ్యం వంటి నైపుణ్యాలు కూడా పెరగాల్సి ఉందని వివరించారు. నిపుణుల కొరత సమస్యగా ఉన్నందున డిజిటల్‌ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వకపోతే.. ఒక కంపెనీకి చెందిన ఉద్యోగులను మరో కంపెనీ నియమించుకునే ప్రయత్నం చేస్తాయని.. ఇది పరిశ్రమపై ప్రభావం చూపుతుందన్నారు.

నైపుణ్యాల కల్పనపైనే ఫోకస్  
దేశంలో యువతను కొత్త తరం టెక్నాలజీలకు సమాయత్తం చేసే ప్రయత్నంలో భాగంగా భవిష్యత్‌ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎన్‌ఐఐటీ ప్రకటించింది. ‘ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌’ పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుత పాఠ్యాంశాలతోపాటుగా ఆసక్తి ఉన్న విభాగంలో భవిష్యత్‌ నైపుణ్యాల్లో కూడా శిక్షణ పొందేలా ప్రోత్సహిస్తామని ఎన్‌ఐఐటీ కెరీర్‌ ఎడ్యుకేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ క్షితిజ్‌ జైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీల్లో ఉద్యోగాలు 2018లో 17 శాతం ఉండగా 2022 నాటికి 33 శాతానికి పెరుగుతాయని, ఇందులో భాగంగా 13 కోట్లకు పైబడి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios