న్యూఢిల్లీ: ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ గ్రూపు చైర్మన్ ఎ.ఎం. నాయక్.. మిడ్ ఐటీ ఫర్మ్ మైండ్ ట్రీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మైండ్ ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్నఐటీ సంస్థ మైండ్ ట్రీని టేకోవర్ చేయడానికి ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ.. మైండ్ ట్రీలో 60 శాతానికి పైగా వాటాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మైండ్ ట్రీ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ, కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఎల్ అండ్ టీ గ్రూప్ చైర్మన్ అనిల్ కుమార్ మణిభాయి నాయక్ (ఎఎం నాయక్)ను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ నియామకం గురువారం నుంచి అమలులోకి వస్తుందని రెగ్యులేటరీ సంస్థల ముందు దాఖలు చేసిన ఫైలింగ్‌లో మైండ్ ట్రీ పేర్కొన్నది. 

 

ఎఎం నాయక్ 18 బిలియన్ల డాలర్ల విలువైన ఎల్ టీ గ్రూప్‌కు చైర్మన్. 54 ఏళ్లుగా పని చేస్తున్న ఎల్ అండ్ టీ. 20 ఏళ్లుగా ఇన్ ఫ్రా మేజర్ గా లీడ్ లో కొనసాగుతున్నది. ప్రస్తుతం మైండ్ ట్రీలో 60.06 శాతం వాటాలను కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ.. దేశీయ ఐటీ రంగంలో తొలిసారి హోస్టిల్ అక్విజన్ చేసి రికార్డులు నెలకొల్పింది. ఈ నెల ప్రారంభంలోనే మైండ్ ట్రీ ప్రమోటర్‌గా ఎల్ అండ్ టీ పేరు ఖరారైంది. 

 

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థళ తన 20.32 శాతం వాటాలను గత మార్చిలో రూ.3000 కోట్లకు ఎల్ అండ్ టీకి విక్రయించడంతో మైండ్ ట్రీ టేకోవర్‌పై ఇన్ ఫ్రా మేజర్ దృష్టి సారించింది. ఓపెన్ మార్కెట్, ఓపెన్ ఆఫర్ ద్వారా మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ తన వాటాను పెంచుకున్నది. తత్ఫలితంగా జూన్ నెలలో ఎల్ అండ్ టీకి మైండ్ ట్రీలో ముగ్గురు డైరెక్టర్లు నియమితులయ్యారు. 

 

ఎల్ అండ్ టీ సీఈఓ కం ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్, సంస్థ సీనియర్లు జయంత్ దామోదర్ పాటిల్, రామమూర్తి శంకర్ రామన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. సుబ్రమణ్యన్, జయంత్, రామమూర్తి నియామకాలు ఈ నెల 16వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా దీపా గోపాలన్ వాద్వా, ప్రసన్న రంగాచార్యలను నియమించారు. 

 

మైండ్ ట్రీ వ్యవస్థాపకులు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు కోసం ప్రయత్నించారు. తమ 13 శాతం వాటాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఈ నెల ఐదో తేదీన మైండ్ ట్రీ సీఈఓ రొస్టొవ్ రావణన్, చైర్మన్ కృష్ణకుమార్ నటరాజన్, వైస్ చైర్మన్ పార్థసారథి ఎన్ఎస్ తమ పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 

 

మైండ్ ట్రీ సహా వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చి ఈ నెలాఖరులో వైదొలగ నున్నారు. మార్చి తర్వాత మైండ్ ట్రీ డైరెక్టర్ల బోర్డులో ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. రావణన్, నటరాజన్, పార్థసారధిలతోపాటు నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు అపూర్వ పురోహిత్, మిలింద్ సవార్టే, అక్షయ్ భార్గవ, బిజోయ్ కురియన్ ఉన్నారు.