ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్ టెల్ కి ఊహించని షాక్ తగిలింది. ఓ కష్టమర్ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా వినియోగదారుల ఫోరం ఎయిర్ టెల్ కి భారీ జరిమానా విధించింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నగరంలోని మణికొండకు చెందిన సచిన్‌వన్‌రావు మాస్కే అనే వ్యక్తి తనకు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు బదిలీ అవ్వడంతో.. మొబైల్‌ఫోన్‌ పోస్ట్‌పెయిడ్‌ సేవలను నిలిపివేయాలంటూ ఎయిర్‌టెల్‌కు పలుమార్లు దరఖాస్తు చేశారు. కాగా.. సేవలను నిలిపివేయకపోగా బిల్లలు పంపించారు.

 మూడేళ్ల పాటు బిల్లులు పంపడంతో పాటు.. ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సిస్టం ద్వారా అతడి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తాన్ని ఎయిర్‌టెల్‌ బదిలీ చేసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పిస్తూ 2013లో ఫోరానికి సచిన్‌ ఫిర్యాదు చేశారు. డబ్బు బదిలీతో తాను నష్టపోయానని, రూ. 30వేల మేర నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు. పూర్వాపరాలు పరిశీలించిన ఫోరం.. బాధితుడికి రూ. 25వేల పరిహారం, 2013 ఏప్రిల్‌ 30 తర్వాతి కాలానికి సంబంధించి 9 శాతం వడ్డీ చెల్లించాలని ఎయిర్‌టెల్‌ను ఆదేశించింది.