Artemis 2: దాదాపు 54 ఏళ్ల తర్వాత నాసా మళ్లీ మనుషులను చంద్రుడి దగ్గరకు పంపిస్తోంది. ఆర్టెమిస్ 2 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి భూమికి తిరిగి వస్తారు. ఈ బృందంలో ఒక మహిళ, ఒక నల్లజాతీయుడు ఉండటం విశేషం.
Artemis 2: దాదాపు 54 ఏళ్ల తర్వాత నాసా మళ్లీ మనుషులను చంద్రుడి దగ్గరకు పంపిస్తోంది. ఆర్టెమిస్ 2 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి భూమికి తిరిగి వస్తారు. ఈ బృందంలో ఒక మహిళ, ఒక నల్లజాతీయుడు ఉండటం విశేషం. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మనిషి మళ్లీ చంద్రుడి వైపు అడుగులు వేశాడు. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ప్రయోగం విజయవంతంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4:06 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఎస్ఎల్ఎస్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌లోని ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో నలుగురు వ్యోమగాములు చంద్రుడి దగ్గరకు ప్రయాణమయ్యారు. ఈ యాత్రలో ఒక మహిళ, ఒక నల్లజాతీయుడు భాగం కావడం చరిత్రలో ఇదే తొలిసారి.
ఈ బృందానికి నాసాకు చెందిన రెయిడ్ వైస్‌మాన్ మిషన్ కమాండర్‌గా, విక్టర్ గ్లోవర్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. మిషన్ స్పెషలిస్టులుగా నాసాకు చెందిన క్రిస్టినా కోచ్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హాన్సన్ ఉన్నారు. ఈ నలుగురు పది రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి భూమికి తిరిగి వస్తారు. ఇప్పటివరకు మనుషులతో కూడిన ఏ వ్యోమనౌక వెళ్లనంత దూరం ఈ మిషన్‌లో ఓరియన్ ప్రయాణిస్తుంది. ప్రయోగానికి ముందు ఈ నలుగురు వ్యోమగాములు కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని ప్రత్యేక క్వారంటైన్‌లో ఉన్నారు. వారి నిద్ర, ఆహారం, నీళ్లు తాగడం వంటివన్నీ కఠినమైన నిబంధనల మధ్య జరిగాయి.
ఈ యాత్రతో క్రిస్టినా కోచ్ చంద్రుడి దగ్గరకు వెళ్తున్న తొలి మహిళగా, విక్టర్ గ్లోవర్ తొలి నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఇక జెరెమీ హాన్సన్ అయితే, చంద్రుడి యాత్రకు వెళ్తున్న తొలి అమెరికాయేతర వ్యోమగామిగా నిలవనున్నారు. ఈ నలుగురితో పాటు 'రైస్' అనే చిన్న బొమ్మ కూడా ప్రయాణిస్తోంది. దానిలో 56 లక్షల మంది పేర్లతో కూడిన మెమరీ కార్డ్ ఉంది.
1972 నాటి అపోలో 17 మిషన్ తర్వాత మనుషులను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్తున్న తొలి మిషన్ ఇదే. అయితే, అపోలో 17 బృందం చంద్రుడిపై కాలు మోపగా, ఆర్టెమిస్ 2 బృందం మాత్రం చంద్రుడి చుట్టూ తిరిగివస్తుంది. 2022 చివర్లో ప్రయోగించిన మానవరహిత ఆర్టెమిస్ 1 మిషన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. అప్పుడు ఓరియన్ వ్యోమనౌక చంద్రుడి చుట్టూ తిరిగి విజయవంతంగా భూమికి చేరుకుంది. చైనా కంటే ముందే చంద్రుడిపైకి మళ్లీ మనిషిని పంపాలన్నది అమెరికా లక్ష్యం.
కొత్త ప్రణాళిక ప్రకారం, ఆర్టెమిస్ 4 మిషన్‌లో వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెడతారు. అయితే, అదంతా ఆర్టెమిస్ 2 విజయంపైనే ఆధారపడి ఉంది. సుదూర అంతరిక్ష ప్రయాణాల కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీ పనితీరును ఈ మిషన్ ద్వారా నిర్ధారించుకోవాలి. అందుకే ఆర్టెమిస్ 2 సంపూర్ణ విజయం సాధించాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.



