టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్ లో 8వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి టీం ఇండియా క్రికెటర్ రికార్డు నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ లో భాగంగా సురేష్  రైనా ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. కాగా.. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్ లో రైనా ఈ రికార్డు నెలకొల్పాడు.

8వేల పరుగులు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రైనా నిలిచాడు. ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో ఎనిమిదివేల పరుగులను చేసిన క్రికెటర్ల జాబితాలో రైనాది ఆరోస్థానం . ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ రైనాకి 300వది కావడం విశేషం. దీంతో మూడొందల టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రైనా గుర్తింపు సాధించాడు. 

ఇప్పటికే 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఘనతను ధోని సాధించగా, ఆ తర్వాత స్థానంలో రైనా ఉన్నాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో పరుగుల విషయానికొస్తే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కంటే 168 పరుగులతో ముందంజలో ఉన్నాడు రైనా. ఇప్పటివరకూ 251 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 7,833 పరుగులు నమోదు చేశాడు.