ఐపీఎల్ 2019 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరస ఓటమిల పాలౌతోంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో.. కోహ్లీ, జట్టు అభిమానులు తీవ్ర నిరాశలకు గురౌతున్నారు. ఇప్పటికే కొందరు అభిమానులు..ఆర్సీబీ అభిమానులుగా తట్టుకోలేకపోతున్నామని ట్రోలింగ్‌కు సిద్దపడగా.. మరికొందరు జట్టు కెప్టెన్‌నే మార్చాలని డిమాండ్‌ చేశారు. 

తాజాగా ఓ వీరాభిమాని అయితే కామెంటేటర్‌ను చంపుతాననే హెచ్చరించాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సిమన్‌ డౌల్‌ ఆర్సీబీ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానని హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. 

‘ఇతరుల గురించి మాట అనే ముందు ఒకసారి ఆలోచించు. ఆర్సీబీ వారి పరాజాయాన్ని అంగీకరించింది. మళ్లీ ఎప్పుడూ ఆర్సీబీని కామెంట్‌ చేయకు. కాదని విమర్శించావో చచ్చిపోతావు.’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు.

కాగా ఆ అభిమాని పోస్టుకి సిమన్ రిప్లై ఇచ్చాడు. ‘‘నేను ఏం మాట్లాడానో కూడా గుర్తులేదు.. దానికే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇది కేవలం ఆట.. చిల్ బ్రో ’’అంటూ సిమన్ పేర్కొన్నాడు.