ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 హర్యానా స్టీలర్స్ మరో ఓటమిని చవిచూసింది. హోంగ్రౌండ్, సొంత ప్రేక్షకుల మధ్యలో మొదటి మ్యాచ్ ఆడుతున్న హర్యానా ఆటగాళు ఆశించిన స్థాయిలో  రాణించలేకపోయారు. అంతేకాకుండా ప్రత్యర్థి యూపీ యోదాస్ స్టార్ రైడర్ శ్రీకాంత్ జాదవ్ 11 పాయింట్లతో అదరగొట్టాడు. ఇలా తమ ఆటగాళ్ల తప్పిదాలు, ప్రత్యర్థి ఆటగాళ్ల దూకుడు ప్రదర్శన వెరసి హర్యానా స్టీలర్స్ 7 పాయింట్ల తేడాతో పరాజయంపాలయ్యింది. 

హర్యానాలోని పంచకుల తావూ దేవీలాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ పోరు వేదికయ్యింది. ఇరు జట్లు గెలుపుకోసం  హోరాహోరీగా పోరాడినా విజయం యూపీనే వరించింది. స్థానిక జట్టయిన స్టీలర్స్ హోంగ్రౌండ్ లో ఓడిపోయి అభిమానులను నిరాశపర్చింది. రైడింగ్, ట్యాకిల్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ స్వల్ప పాయింట్ల తేడాతో వెనుకబడి స్టీలర్స్ విజయావకాశాలను దెబ్బతీసుకుంది. 

హర్యానా ఆటగాళ్లలో వినయ్ 8, రవి కుమార్ 5, వికాస్ 5, ప్రశాంత్ 3 పాయింట్లతో  ఆకట్టుకున్నారు. దీంతో ఆ జట్టు రైడింగ్ లో 19, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 2 మొత్తం 30  పాయింట్లు  సాధించింది. 

అదే విజేత యూపీ ఆటగాళ్లలో శ్రీకాంత్ 11, నితేశ్ 7, సురీందర్ గిల్ 7, సుమిత్ 3 పాయింట్లు సాధించారు. దీంతో ఈ జట్టు రైడింగ్ లో 21, ట్యాకిల్స్ లో 12, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల ద్వారా మరో 3 మొత్తం 37 పాయింట్లతో విజయకేతనం ఎగరేసింది.