ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ మరో విజయాన్ని అందుకుంది. గుజరాత్ ఫార్చ్యూన్ జాయింట్స్ ను వారి సొంత గడ్డపైనే  ఓడించి సత్తా చాటింది. గుజరాత్ కూడా చివరి వరకు  ఓటమిని అంగీకరించకుండా పోరాడింది.  హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు 28-26 పాయింట్ల తేడాతో బెంగాల్ విజేతగా నిలిచింది. 

బెంగాల్ జట్టు స్టార్ రైడర్ ప్రబంజన్ 8 పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆ జట్టులోని మిగతా  ఆటగాళ్లలో ఇస్మాయిల్ 5, మణిందర్ సింగ్ 5 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇలా రైడింగ్  లో 16, ట్యాకిల్స్ లో 7,ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 3 ఇలా బెంగాల్ మొత్తం 28 పాయింట్లు సాధించింది.

గుజరాత్ ఆటగాళ్లలో సోను 8, సచిన్ 6, సునీల్ 6 పాయింట్లతో చెలరేగినా  జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. గుజరాత్ రైడింగ్ లో 15, ట్యాకిల్స్ లో 11 పాయింట్లతో బెంగాల్ కంటే మెరుగ్గానే ఆడారు. అయితే ఒక్కసారి కూడా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోవడం, ఎక్స్‌ట్రాల రూపంలో పాయింట్లు లభించకపోవడం గుజరాత్ జట్టు  ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. ఇలా కేవలం 2 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ విజయాన్ని అందుకుంది.