Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన రెజ్లర్ సుశీల్ కుమార్

ఈ కేసుకు సంబంధించి సుశీల్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా.. న్యాయస్థానం సైతం అతనికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. 

Olympic medallist Sushil Kumar sent to six-day police custody
Author
Hyderabad, First Published May 24, 2021, 7:50 AM IST

గత కొద్ది రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు చిక్కాడు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుశీల్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా.. న్యాయస్థానం సైతం అతనికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. అయినప్పటికీ సుశీల్ దాదాపు 19 రోజులపాటుగా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా.. చివరకు ఆదివారం పోలీసులకు చిక్కాడు.

ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్‌ కుమార్, అతడి అనుచరుడు అజయ్‌ కుమార్‌ను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం సుశీల్, అజయ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్‌ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు.  

ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్‌ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ సాగర్‌ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్‌ కుమార్‌లతో సుశీల్‌ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్‌ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సోనూ, అమిత్‌ పేర్కొన్నారు. 

దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్‌లతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్‌ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్‌ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్‌ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్‌ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్‌ 14 వేర్వేరు సిమ్‌ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్‌ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. చివరకు ఢిల్లీలో పట్టుపడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios