ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోగా మరికొన్ని జట్లు ఇంకా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్లేఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను కూడా బిసిసిఐ ప్రకటించింది. 

ఫైనల్ తో పాటు క్వాలిఫయర్ 1 మ్యాచ్ లకు దుబాయ్ లో జరగనుండగా మిగతా రెండు ప్లేఆఫ్ మ్యాచ్ లు అబుదాబిలో జరగనున్నాయి. లీగ్ దశలో టాప్ లో నిలిచిన రెండు జట్ల మధ్య నవంబర్ 5వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్ జరగనుంది. అలాగే నవంబర్ 10వ తేదీన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా  ఇదే స్టేడియంలో జరగనుంది. 

ఇక అబుదాబిలోని షేక్ జాయెదెద్ స్టేడియంలో నవంబర్ 6వ తేదీన పాయింట్స్ పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 8వ తేదీన క్వాలిఫయర్ 2 (ఎలిమినేటర్ మ్యాచ్ విన్నర్ వర్సెస్ క్వాలిఫయర్ 1 లో ఓడిన జట్టు) కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. 

భారతదేశంలో కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరకు యూఏఈకి తరలిన విషయం తెలిసిందే. దుబాయ్ మరియు అబుదాబిలలో మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. లీగ్ దశ ముగింపుకు చేరుకోవడంతో కీలకమైన ప్లేఆప్ మ్యాచ్ ల షెడ్యూల్ ను బిసిసిఐ తాజాగా ప్రకటించింది.