Asianet News TeluguAsianet News Telugu

రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వేధింపులు : మేరీకోమ్ సారథ్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన ఐఓఏ

లైంగిక వేధింపుల మీద మహిళా రెజ్లర్ల నిరసన కొంత ఫలించింది. స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 

IOA formed panel to probe and inquiry committee headed by Mary Kom - bsb
Author
First Published Jan 21, 2023, 8:21 AM IST

ఢిల్లీ : లైంగిక వేధింపుల నేపథ్యంలో మూడు రోజులుగా రెజ్లర్లు ఆందోళన  చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో కీలక పరిణామం శుక్రవారం చోటుచేసుకుంది. వీరి ఆందోళనలను ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న భారత ఒలంపిక్ సంఘం.. వీటి మీద విచారణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది. మహిళా రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి స్టార్ బాక్సర్ మేరీకోమ్ సారథ్యం వహిస్తారు. 

ఈ కమిటీలో ఆమెతోపాటు ఆర్చర్ డోలా బెనర్జీ, దిగ్గజ రేజ్లర్ యోగేశ్వర్ దత్, ఐఓఏ సంయుక్త కార్యదర్శి అలక్ నంద అశోక్, భారత వెయిటీ లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఐఓఏ కోశాధికారి సహదేవ్ యాదవ్, న్యాయవాదులు తాలిష్ రాయ్, శ్లోక్ చంద్రలు ఉన్నారు. అంతకుముందు ఐఓఏ అధ్యక్షురాలు పి.టి.ఉషకు మహిళా రెజ్లర్లు తమపై భూషణ్ లైంగిక హింసకు పాల్పడ్డాడని.. దీనిమీద విచారణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ  లెటర్ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో.. అదే రోజు సాయంత్రం అత్యవసర కార్యనిర్వాహక మండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఐఓఏపై ఆరోపణలపై విచారణ చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు.  ఈ క్రమంలోనే మేరీకోం సారధ్యంలో  విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ సమావేశం వర్చువల్ గా జరిగింది. ఈ మీటింగ్ లో అద్దెట్ల కమిషన్ సభ్యులు శివ కేశవన్, అభినవ్ బింద్రా కూడా పాల్గొన్నారు. ఐఓఏ అధ్యక్షురాలు పి.టి.ఉషకు రెజ్లర్లు రాసిన లెటర్ మీద సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈ చర్చల సారాంశంగా  మహిళలపై లైంగిక హింస నిరోధక చట్టం 2013 ప్రకారం విచారణ కమిటీని ఏర్పాటు చేశామని ఐఓఏ చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులకు గురైన బాధితుల పేర్లను రెజ్లర్లు తెలియజేస్తే… విచారణ కమిటీ మెంబర్లు వారిని వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరిస్తారని తెలిపారు.

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వేధింపులపై పి.టి. ఉషకు లేఖ రాసిన రెజ్లర్లు.. స్పందించిన ఐఓఏ అధ్యక్షురాలు

లేఖలో రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐను రద్దు చేయాలని కోరారని.. అయితే దానిని రద్దు చేసే అధికారం తమకు లేదనే విషయాన్ని కూడా  ఐఓఏ  చర్చించింది. కేవలం ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య మాత్రమే ఆ పనిని చేయగలదని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా ఈ విచారణ కమిటీలో ఉన్న వారిలో ఎక్కువ మంది బీజేపీ సంబంధిత నేతలే ఉన్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మద్దతుగా నిలిచే యోగేశ్వర్ ను కమిటీలో ఎంపిక చేశారు. దీనిని రెజ్లర్లు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉండగా ఇంకోవైపు క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ తో  రెజ్లర్లు రెండోసారి చర్చలు జరిపారు.

పి.టి.ఉషకు రాసిన లేఖలో రెజ్లర్లు ప్రధానంగా నాలుగు డిమాండ్ల పరిష్కారానికి కోరారు. ‘డబ్ల్యూఎఫ్ఓ అధ్యక్షుడు భూషణ్ పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఫిర్యాదులను మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. దేశంలోని రెజ్లర్లు అందరి తరపున ఈ పని చేస్తున్నాం.  ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంతమంది యువరెజ్లర్లు మాతో చెప్పిన లైంగిక వేధింపుల ఫిర్యాదులు ఇవి. డబ్ల్యూఎఫ్ఐలో  లైంగిక వేధింపులే కాదు... ఆర్థిక అవకతవకలు కూడా జరుగుతున్నాయి.

టాటా మోటార్స్ స్పాన్సర్షిప్ నుంచి ఒప్పందం ప్రకారం కొంతమంది సీనియర్ రెజ్లర్లకు ఇవ్వాల్సిన చెల్లింపులు గత కొన్నేళ్లుగా పూర్తిగా జరగలేదు. వినేశ్ టోక్యో ఒలంపిక్స్ లో పథకం గెలవకపోవడంతో ఆమెను భూషణ్ మానసికంగా చాలా హింసించాడు. ఈ హింసను తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. నేషనల్ క్యాంప్ లో భూషణ్ నియమించిన కోచ్ లు, స్పోర్ట్స్ సైన్స్ సిబ్బంది పూర్తిగా అసమర్థులే. ఈ నేపథ్యంలో మేము నాలుగు డిమాండ్లను మీ ముందు ఉంచుతున్నాము.. అవేంటంటే..

- మేము చెబుతున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులపై  వెంటనే  విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి.
- డబ్ల్యూఎఫ్ఐ  అధ్యక్షుడు  వెంటనే రాజీనామా చేయాలి.
- డబ్ల్యూఎఫ్ఐని రద్దు చేయాలి.
- రెజ్లర్లతో సంప్రదించి డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాలను నిర్వహణ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి.
ఈ నాలుగు డిమాండ్లు తీరేవరకు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిని తప్పించేంతవరకు నిరసన కొనసాగిస్తామని ఆ లేఖలో రెజ్లర్లు పేర్కొన్నారు. దీనిపై వేధింపులు ఎదుర్కొన్న వినేష్ తోపాటు బజరంగ్, రవి దహియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ లు సంతకాలు చేశారు.

కాగా,  తనమీద ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ బ్రిజ్ భూషణ్ పదవి వదిలేందుకు సిద్ధంగా లేనని స్పష్టంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో గురువారం  కేంద్ర క్రీడల మంత్రితో రెజ్లర్ల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని 24 గంటల లోపు రాజీనామా చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. కానీ బిజెపి ఎంపీ కూడా అయిన భూషణ్ మాట్లాడుతూ..‘రెజ్లర్ల ధర్నా వెనక రాజకీయ కుట్ర ఉంది… అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేయను. ఇది నాపై దాడి మాత్రమే కాదు.. నా ద్వారా బిజెపిని టార్గెట్ చేసుకున్నారు’ అని విమర్శలకు గుప్పించారు. కాగా ఐఓఏ విచారణ కమిటీని నియమించిన నేపథ్యంలో మూడు రోజులుగా నిరసనలు తెలుపుతున్న రెజ్లర్లు.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమ నిరసనను విరమించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios