మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుచేసి బంఫర్ మెజారిటీతో బిజెపి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఇదే ఊపును ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కొనసాగించాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. అందుకోసం వివిధ రంగాల్లో ఓ వెలుగువెందిన మహారాష్ట్ర, హర్యానాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ను పార్టీలోకి చేర్చుకుని హర్యానా ఎన్నికల బరిలోకి దించేందుకు బిజెపి రంగం సిద్దంచేస్తోంది. 

యోగేశ్వర్ హర్యానా రాష్ట్రానికి చెందిన భారత రెజ్లర్. 2012 ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా అతడి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారెమోగింది.  అంతేకాకుండా 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించడంతో అతడి కీర్తి మరోస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత అతడు రెజ్లింగ్ కు దూరమై రాజకీయాలకు దగ్గరయ్యాడు. 

యోగేశ్వర్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో   బిజెపి తరపున పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతడి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా యోగేశ్వర్ వ్యవహారశైలిని పరిశీలిస్తే ఈసారి ఖచ్చితంగా  ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. 

యోగేశ్వర్ దత్ బుధవారం హర్యానా బిజెపి అధ్యక్షులు సుభాష్ బరాలతో చర్చలు జరిపాడు. వీరిద్దరి మధ్య తాజా అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా  ఎక్కడినుండి పోటీచేస్తే బావుంటుందన్న దానిపై  కూడా వీరిద్దరి మధ్య మంతనాలు జరిగాయట. అతిత్వరలో యోగేశ్వర్ పోటీచేసే స్థానంపై క్లారిటీ వస్తుంందని బిజెపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  అందుకోసమే అతడు  పోలీస్ శాఖలో ఉద్యోగానికి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.