CWG 2022: గురురాజ పూజారికి కాంస్యం.. భారత్‌కు రెండో పతకం..
Commonwealth Games 202: వెయిట్‌లిఫ్టింగ్ లో భారత్ మరో పతకం పట్టింది. పురుషుల 61 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్ లో గురురాజ పుజారి కాంస్యం నెగ్గాడు.
కామన్వెల్త్ క్రీడలలో భారత్ పతకాల సంఖ్యను పెంచుతూ వెయిట్‌లిఫ్టర్ గురురాజ పుజారి పతకం నెగ్గాడు. పురుషుల 61 కిలలో కేటగిరిలో అతడు.. 269 కిలోల బరువును ఎత్తి కాంస్యం గెలిచాడు. స్నాచ్ లో 118 కిలోలు ఎత్తిన అతడు.. క్లీన్ అండ్ జెర్క్ లో 153 కిలోలను ఎత్తాడు. దీంతో మొత్తంగా అతడు 269 కిలోలు ఎత్తి కాంస్యం నెగ్గాడు. ఈ పోటీలలో మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ మహ్మద్.. 285 కిలలో ఎత్తి స్వర్ణం గెలిచాడు. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కిలోలు ఎత్తి రజతం నెగ్గాడు.
2018లో గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ లో గురురాజ పుజారి రజతం నెగ్గాడు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన అతడు జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శనలు చేస్తూ బర్మింగ్‌హామ్ లో స్వర్ణం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఇక శనివారం భారత్ కు ఇదే వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్ సర్గర్ తొలి పతకాన్ని అందించిన విషయం తెలిసిందే. పురుషుల 55 కిలోల కేటగిరీలో భాగంగా సంకేత్.. స్నాచ్ లో 113 కేజీలను ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 135 కేజీలను ఎత్తిపడేశాడు. మోచేతికి గాయమైనా వెనుదిరకుండా ఆడి రజతాన్ని నెగ్గాడు. ఈ పోటీలలో మలేషియాకి చెందిన మహ్మద్ అనీక్, 249 కేజీలతో స్వర్ణం సాధించాడు. రెండో స్థానంలో నిలిచిన సంకేత్‌కు, అనీక్‌కు మధ్య తేడా ఒక్క కేజీ మాత్రమే కావడం గమనార్హం.
తాజా ఫలితంతో రెండో రోజు భారత్ కు ఒక రజతం, ఒక కాంస్యం వచ్చాయి. విజేతలను ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ రాజకీయ నాయకులు, ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.