Fifa World Cup: 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా ప్రధాన ఆతిథ్య దేశంగా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే వివక్ష, వీసా పరిమితులు, కఠిన భద్రతా తనిఖీలు, పర్యావరణ ప్రభావం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఆటగాళ్లకు కఠిన తనిఖీలు.. వివక్ష ఆరోపణలు
ప్రపంచకప్ కోసం అమెరికాకు చేరుకున్న కొన్ని దేశాల జట్లకు విమానాశ్రయాల్లో అసాధారణ స్థాయిలో తనిఖీలు జరిగాయని వార్తలు వెలువడ్డాయి. సెనగల్ జట్టు అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే భద్రతా సిబ్బంది వారిని రన్‌వేపైనే తనిఖీ చేసినట్లు సమాచారం. అలాగే ఉజ్బెకిస్తాన్ ఆటగాళ్లను మాదక ద్రవ్యాలు గుర్తించే కుక్కల బృందాలు, మెటల్ డిటెక్టర్లతో పరీక్షించినట్లు కథనాలు వస్తున్నాయి. ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ జాతీయత, చర్మరంగు కారణంగా అనుమానాల దృష్టితో చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి యూరప్ దేశాల ఆటగాళ్లకు ఎదురైందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
అభిమానులు, అధికారులు కూడా ఇబ్బందుల్లోనే
వివక్షకు గురైన వారి జాబితాలో అభిమానులు మాత్రమే కాకుండా మీడియా ప్రతినిధులు, జట్ల అధికారిక సిబ్బంది, రిఫరీలు కూడా చేరారు. ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించే తొలి సోమాలియా మూలాలున్న రిఫరీలలో ఒకరైన ఒమర్ అబ్దుల్ ఖాదిర్ ఆర్టాన్‌కు అమెరికా ప్రవేశం నిరాకరించిన ఘటన చర్చనీయాంశమైంది. అలాగే ఇరాన్ జట్టుకు చెందిన 15 మంది అధికారులకు ఇప్పటివరకు వీసాలు మంజూరు కాలేదని సమాచారం. దీనివల్ల ఇరాన్ జట్టు తమ ప్రాక్టిస్‌ను మెక్సికోలో నిర్వహించాల్సి వచ్చింది. ఇరాక్ స్టార్ ఆటగాడు అయ్మన్ హుస్సేన్‌ను చికాగో విమానాశ్రయంలో ఏడు గంటలపాటు నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. ఇరాక్ జట్టు ఫోటోగ్రాఫర్ తలాల్ సలాకు 10 గంటలపాటు నిరీక్షణ తర్వాత ప్రవేశం నిరాకరించినట్లు పేర్కొంటున్నారు.
ట్రంప్ విధానాలపై ఫిఫా మౌనం ఎందుకు?
2017లో డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో కొన్ని ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించినప్పుడు, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాన్తినో కఠినంగా స్పందించారు. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు, వారి సిబ్బంది, అభిమానులకు ప్రవేశం కల్పించాల్సిందేనని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని విమర్శకులు అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేసినప్పటికీ ఫిఫా నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. హైతీ, ఇరాన్, సెనగల్, ఐవరీ కోస్ట్ వంటి దేశాల అభిమానులు ప్రయాణ పరిమితులను ఎదుర్కొంటున్నారని సమాచారం.
ప్రపంచకప్ చూడటం సామాన్య అభిమానులకు భారమా?
2026 ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా వీసా కోసం ఒక్క వ్యక్తి సుమారు 185 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.18 వేల వరకు అవుతుంది. అదనంగా వ్యక్తిగత ఇంటర్వ్యూ, టోర్నమెంట్ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అదనపు ఆర్థిక హామీలు కూడా కోరుతున్నట్లు కథనాలు చెబుతున్నాయి. దీనివల్ల సాధారణ అభిమానులు ప్రపంచకప్‌కు వెళ్లడం మరింత కష్టమవుతుందని భావిస్తున్నారు. మరోవైపు టికెట్లు, హోటల్ ఖర్చులు కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి.
పర్యావరణంపై కూడా ఆందోళనలు
ఈ ప్రపంచకప్ అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో నిర్వహించనున్నారు. మూడు దేశాల్లో విస్తరించి ఉండే ఈ టోర్నమెంట్ కారణంగా జట్లు, అభిమానులు తరచూ విమాన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దీంతో కార్బన్ ఉద్గారాలు భారీగా పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచకప్ నిర్వహణ వల్ల సుమారు 9 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమాన ఉద్గారాలు విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇది గత నాలుగు ప్రపంచకప్‌ల సగటు ఉద్గారాల కంటే దాదాపు రెండింతలు అని విశ్లేషణలు చెబుతున్నాయి.


