IND vs ZIM: జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

భారీ స్కోర్‌తో ఒత్తిడి పెంచిన భారత బ్యాటర్లు

హరారేలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో 44 బంతుల్లో 81 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. చివర్లో తిలక్ వర్మ వేగంగా ఆడుతూ 29 బంతుల్లో అజేయంగా 60 పరుగులు సాధించి జట్టు స్కోరును 200 దాటించాడు. వైభవ్ సూర్యవంశీ 20 పరుగులతో మెరుపులు మెరిపించగా, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించాడు. ముఖ్యంగా ఇషాన్-తిలక్ జోడీ నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి పెంచింది.

భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన జింబాబ్వే

220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని 17.5 ఓవర్లలోనే 129 పరుగులకు ఆలౌట్ చేశారు. బ్రియన్ బెన్నెట్ చేసిన 32 పరుగులే ఆ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. భారత్ తరఫున యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తలా వికెట్లు పడగొట్టి జింబాబ్వే బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. యశ్ ఠాకూర్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి వికెట్‌ను నమోదు చేయడం విశేషం. ప్రిన్స్ యాదవ్ కీలక సమయంలో బెన్ కర్రన్, సికందర్ రజాలను ఔట్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు.

Scroll to load tweet…

చివరి మ్యాచ్ నామమాత్రం

వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకుంది. దీంతో చివరి టీ20 మ్యాచ్ కేవలం నామమాత్రంగానే మిగిలింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ సమిష్ఠి ప్రదర్శన చేసిన టీమిండియా యువ ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్, చివరి మ్యాచ్‌లోనూ విజయంతో క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.