Asian Games: ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ జట్టు సత్తా చాటింది. మంగళవారం జరిగిన మహిళల 4x400 మీటర్ల రిలే ఫైనల్లో భారత బృందం అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
విత్య రామ్‌రాజ్ అద్భుత పోరాటం
ఫైనల్ రేసు ఆరంభం నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా చివరి దశలో బహ్రెయిన్ రన్నర్ సల్వా ఈద్ నాసర్ వేగంగా దూసుకొచ్చారు. దీంతో యాంకర్‌గా పరుగెత్తిన విత్య రామ్‌రాజ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే ఆమె ఏమాత్రం తడబడకుండా వేగాన్ని కొనసాగిస్తూ భారత జట్టును ముందంజలో నిలిపారు. భారత్ 3:29.69 నిమిషాల్లో రేసు పూర్తి చేయగా.. బహ్రెయిన్ 3:30.21తో రజతం, చైనా 3:31.02తో కాంస్యం సాధించాయి. బహ్రెయిన్ కంటే భారత్ 0.52 సెకన్ల ముందుగా గమ్యాన్ని చేరింది.
విత్య ఖాతాలో మూడో పతకం
ఈ రిలే స్వర్ణంతో విత్య రామ్‌రాజ్‌కు 2026 ఆసియా క్రీడల్లో మూడో పతకం దక్కింది. అంతకుముందు మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో ఆమె రజతం గెలిచింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లోనూ విత్య కాంస్య పతకం సాధించారు. ఆ ఈవెంట్‌లో 54.75 సెకన్లతో పరుగెత్తిన ఆమె.. పీటీ ఉష పేరిట నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న జాతీయ రికార్డును అధిగమించారు. ఇప్పుడు 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించడంతో ఈ క్రీడల్లో ఆమె పతకాల సంఖ్య మూడుకు చేరింది.
అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు
మహిళల 4x400 మీటర్ల రిలే స్వర్ణంతో పాటు మంగళవారం అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు లభించాయి. మహిళల హైజంప్ ఫైనల్లో పూజ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. పురుషుల 5000 మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ 13:32.75 నిమిషాల టైమింగ్‌తో కాంస్యం సాధించారు. ఇప్పటికే 10,000 మీటర్లు, 1500 మీటర్లలో రజత పతకాలు గెలిచిన గుల్వీర్.. తాజా పతకంతో ఈ ఆసియా క్రీడల్లో మూడో మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మిక్స్‌డ్ 4x100 మీటర్ల రిలేలోనూ భారత బృందం కాంస్యాన్ని సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలగా చివరి ల్యాప్‌లో విత్య రామ్‌రాజ్ చూపించిన పట్టుదల జట్టుకు పసిడి పతకాన్ని ఖాయం చేసింది.


