CWG 2022: ‘కామన్వెల్త్’లో మన ఆశలు మోసే యోధులు వీళ్లే.. ఏ ఏ క్రీడల్లో ఎందరంటే..?
Commonwealth Games 2022: ప్రతీ నాలుగేండ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడలకు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. బర్మింగ్‌హోమ్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడలలో ‘భారత కథ’ మీకోసం..
ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హోమ్ వేదికగా నేటి (జులై 28) నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 11.30 గంటలకు ప్రారంభ వేడుకలు జరుగుతాయి. 72 దేశాల నుంచి సుమారు 5వేలకు పైగా అథ్లెట్లు పాల్గొంటున్న ఈ ‘మినీ ఒలింపిక్స్’లో భారత్ కూడా భాగమౌతున్నది. కామన్వెల్త్ క్రీడల ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏ ఏ క్రీడల్లో భారత క్రీడాకారులు పోటీ పడుతున్నారు. పతకాలు వచ్చే అవకాశాలున్న క్రీడాంశాలు ఏవి..? తదితర విషయాలు ఇక్కడ చూద్దాం.
20 క్రీడాంశాలలో పోటీలు జరుగనున్న ఈ మెగా ఈవెంట్ లో భారత్ సుమారు 16 క్రీడల్లో బరిలోకి దిగబోతున్నది. 215 మందితో కూడిన మన వీరులు.. ఇప్పటికే బర్మింగ్‌హోమ్ లోని కామన్వెల్త్ క్రీడా గ్రామంలో అడుగుపెట్టారు.
కామన్వెల్త్‌లో ఆడబోయే క్రీడాంశాలు :
అథ్తెటిక్స్, అక్వాటిక్స్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, సైక్లింగ్, 3*3 బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, జూడో, హాకీ, లాన్ బౌల్స్, నెట్ బాల్, రగ్బీ సెవెన్స్, పారా పవర్ లిఫ్టింగ్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, ట్రయథ్లాన్, రెజ్లింగ్., వెయిట్ లిఫ్టింగ్
భారత్ పాల్గొనబోయేవి..
పైన పేర్కొన్న క్రీడాంశాల్లో భారత్ 16 క్రీడల్లో పాల్గొంటున్నది. ఈ మేరకు 215 మంది క్రీడాకారులు బర్మింగ్‌హోమ్ లోనే ఉన్నారు. ఒక్కో క్రీడను తీసుకుంటే అథ్లెటిక్స్ లో 43 మంది, హాకీ (పురుషుల, మహిళల జట్లు కలిపి) లో 36, మహిళల క్రికట్ జట్టు నుంచి 15 మంది ఉన్నారు. అంతేగాక వెయిట్ లిఫ్టింగ్ (15 మంది), సైక్లింగ్ (13), బాక్సింగ్ (12), రెజ్లింగ్ (12), టేబుల్ టెన్నిస్ (12), బ్యాడ్మింటన్ (10), లాన్ బౌల్స్ (10), స్క్వాష్ (9), జిమ్నాస్టిక్స్ (7), స్విమ్మింగ్ (7), జూడో (6), ట్రయథ్లాన్ (4), పారా పవర్ లిఫ్టింగ్ లో నలుగురు క్రీడాకారులు బరిలో ఉన్నారు.
పక్కా పతకాలు వచ్చే అవకాశాలు వీటిలో..
16 క్రీడల్లో భారత్ పోటీ పడుతున్నా పతకాలు సాధించే అవకాశాలున్నవి మాత్రం గట్టిగా ఐదారు క్రీడాంశాలలోనే మనం బలంగా ఉన్నాం. వాటిలో బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్ ఎక్కువ పతకాలు ఆశించొచ్చు. క్రికెట్, హాకీలో కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అథ్లెటిక్స్ లో కెనడా వీరులను దాటుకుని మనోళ్లు ఏమేరకు రాణిస్తారనేది వేచి చూడాలి. ఈసారి సైక్లింగ్ తో పాటు స్క్వాష్ లో కూడా భారత్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్నారు.
షూటింగ్ లేకపోవడం భారీ లోటు..
ఈసారి కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ ను తొలగించారు. ఇది భారత్ కు కోలుకోలేని షాక్. భారత్ ఈ క్రీడలలో ఇప్పటివరకు మొత్తంగా 503 పతకాలు సాధించగా.. అందులో షూటింగ్ లోనే ఎక్కువొచ్చాయి. ఈ విభాగంలో 63 స్వర్ణాలు, 44 రజతాలు, 26 కాంస్యాలు వచ్చాయంటే భారత్ షూటింగ్ లో ఏ స్థాయిలో రాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విభాగంలో భారత షూటర్ల గురి తప్పడం లేదు. మొత్తంగా షూటింగ్ లోనే భారత్ 133 పతకాలు అందుకుంది. అదీగాక ఈ క్రీడలలో అత్యంత విజయవంతమైన భారత ఆటగాడు కూడా ఒక షూటరే కావడం గమనార్హం. దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా.. కామన్వెల్త్ క్రీడలలో ఏకంగా 15 పతకాలు నెగ్గాడు. 2018లో గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో భారత్ మొత్తంగా 66 పతకాలు నెగ్గితే అందులో 16 పతకాలు షూటింగ్ లో వచ్చినవే. కానీ ఈసారి ఈ క్రీడను కామన్వెల్త్ లో ఆడించడం లేదు.