Asianet News TeluguAsianet News Telugu

కార్తీక పౌర్ణమి పండగ ఎప్పుడు జరుపుకోవాలి

2021 నవంబర్ లో కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం 2.27 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం. దీనిని మిగులు, తగులు అని అంటారు.

When was we should celebrate Karthika Pournami
Author
Hyderabad, First Published Nov 18, 2021, 11:18 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణ‌మి. అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ రోజు ఇష్టమైనదని భావిస్తారు. ఈ పౌర్ణమినాడే పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. నిర్మలమైన ఆకాశం, అందులో పిండివెన్నెల కురిపిస్తూ వెలుగుల రేడు, భక్తులతో కళకళలాడే దేవాలయాలు, కనువిందు చేసే దీపకాంతులు, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే శివకేశవ నామస్మరణలు, పట్టుదుస్తుల్లో సంప్రదాయానికి ప్రతీకగా కనిపించే ఆడపడచులు.. కార్తిక పౌర్ణమి వేళ కనువిందు చేసే మనోహర దృశ్యమాలిక ఇది. ఈ నెలలో ప్రతి రోజూ ప్రత్యేకమైనదే! కార్తీక పౌర్ణ‌మి అత్యంత విశిష్టమైనదని శాస్త్ర వచనం. ఆధ్యాత్మిక సౌరభాల్ని మెండుగా ప్రసరింపజేసే నిండు పున్నమి విశేషాలివి..

                కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
                జలే స్థలే యే నివసంతి జీవాః
                దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః

ఈ శ్లోకం చదువుతూ కార్తిక పౌర్ణమి నాడు దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది. ఈ రోజు వెలిగించిన దీపపు కాంతిని చూసిన సమస్త జీవులకు శుభం జరగాలని కోరుకోవడమే ఈ శ్లోకం అర్థం. దక్షిణాయనంలో వచ్చే కార్తిక మాసం ఉపాసనకు సంబంధించినది. దీపారాధన చేస్తూ 'దామోదరమావాహయామి' అని గానీ, 'త్రయంబకమావాహయామి' అని గానీ తమ ఇష్టదైవాలైన శివకేశవులను ఆవాహన చేస్తారు. దైవీశక్తి సంతరించుకున్న ఈ దీపాలు ఆత్మజ్యోతిని కూడా ప్రకాశింపజేస్తాయని నమ్మకం. ఆధ్యాత్మిక సాధన సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి.

2021 నవంబర్ లో కార్తీక పౌర్ణమి తిధి 18వ తేదీ మధ్యాహ్నం 12.01 నిమిషాల నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ మధ్యాహ్నం 2.27 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం. దీనిని మిగులు, తగులు అని అంటారు.
పెద్దగా కంగారు పడవలసిన పని లేదు. సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేదధర్మ నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే దీపావళిని ఖచ్చితంగా ఆ రోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి.

అదేవిధంగా పౌర్ణమి కూడా రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే. ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే. కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయాన్ని గమనించాలి.

ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా గురు 'లక్ష్మి'వారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది. ఆ విధంగా పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం, శుక్రవారం  తెల్లవారుజామున 4 :29 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 18వ తేదీన గురువారం రాత్రి  మాత్రమే జరుపుకోవాలి. మరుసటి రోజు అంటే శుక్రవారం రాత్రికి  జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు. కృష్ణపక్షం వచ్చేస్తుంది. కొంతమేర సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే. ఉపవాస నియమం ఉన్న, ఉండాలనుకునే వారు మాత్రం 18వ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని, చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు.

ఉపవాస నియమం లేని వారు దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 18వ తేదీ రాత్రి లేదా 19వ తేదీ ఉదయం 4 :30 గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు. 19వ తేదీ శుక్రవారం కూడాను మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది. కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 19వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును.
అదేవిధంగా నోములు, తోరాలు ఉన్నవారు కూడా 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి 18వ తేదీ  గురువారం సాయంత్రం కూడా నోములు, వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు. మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి. తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే. 

చంద్రగ్రహణం మనకు వర్తించదు:- 18 /19 నవంబర్ లో ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమాన ప్రకారం 19 శుక్రవారం రోజు కృత్తికా నక్షత్రం, వృషభరాశిలో ఏర్పడనున్న రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సమయం మన భారతదేశంలో ఏ ప్రాంతంలో చంద్రోదయం కాదు కాబట్టి ఏ విధమైన గ్రహణ పట్టువిడుపు స్నానాలు, గ్రహణ సూతకాలు మనకు వర్తించవు. గర్భిణీ స్త్రీలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios