నేడు వసంత పంచమి. మాఘ శుక్ల పంచమి దీనికే వసంత పంచమి శ్రీ పంచమి అని అంటారు. అజ్ఞానము మానవుని దానవునిగా రూపొందిస్తుంది. జ్ఞానమును ప్రసాదించి మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి, పూజించే రోజే శ్రీపంచమి. 
మాఘశుద్ధ పంచమి శ్రీసరస్వతి జన్మదినంగా భావిస్తారు. యావద్భారతావనిలో ప్రజలంతా, ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి.

సకల విద్యా స్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి. ‘యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా’’ అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.

మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥

మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమిగా పేర్కొనడంతో, ఈ రోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలనీ, శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. 

శ్రీ సరస్వతీదేవిని తెల్లని పులతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చించి తెల్లనివస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే, ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం... పూర్వం రాజాస్థానాలలో ఈ రోజు దర్బారులు నిర్వహించి, కవితా ఘోష్టులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడంటారు. గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురు శాపం వలన విద్యలను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.

వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన చేసి  పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూల పురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.

విద్యలకు అధిష్ఠాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహం వలన ఉలుకూ, పలుకూ, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతి మరుపు, మాంద్యం తొలగుతాయి, మేథాశక్తి పెంపొంది, సరియైన జ్ఞానం కలిగి ఇహమూ, పరమూ, మోక్షమూ లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. శృతులలో సరస్వతీ దేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. 

‘అమ్మలగన్నయమ్మ’ ఆమె. నదులలో గొప్పది. దేవతలలో శ్రేష్టురాలు. అందుచేతనే ‘‘యాబ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిః దైవైః’’ సదా పూజలనందుకుంటున్నది. శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వేద వాఙ్మయాన్ని పొంది, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునఃప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు. శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరీ క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేసేరు..

సరస్వతీ దేవిని తెల్లనిపూలతో పూజించాలి. పాలతో చేసిన క్షీరాన్నం నివేదన చేయాలి. ఓం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. పుస్తకాలు,పెన్నులు యందు సరస్వతీ దేవిని ఆవాహన చేసి పూజించాలి. మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని దూషించరాదు, ఇతరుల గురించి చెడుగా మట్లాడరాదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతీ కటాక్షమే. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతీమాతను పూజించాలి. విద్యార్ధులు ఈ  రోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి, అమ్మ అనుగ్రహం కలిగేతే ఎంతటి వారికైనా అఖండ విద్యాప్రాప్తి లభిస్తుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151