డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

                శుక్ల పక్షాస్య చాష్టమ్యాం మాఘ మాసస్య పార్ధివ
                 ప్రాజాపత్యేచ నక్షతే మధ్యం ప్రాప్తే దివాకర

పై శ్లోకం ఆధారంగా భారత యుద్ధం ప్రారంభించి పది రోజుల వరకూ భీష్ముడు యుద్ధం చేసి పితృదేవతా నక్షత్రమైన అశ్విని నక్షత్రం రోజున పడిపోయాడు. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉండటం చేత ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉన్నాడు. భీష్మ నిర్యాణము సమయం ఆసన్నమైనది అని గుర్తు చేస్తూ ఓ ధర్మరాజ సూర్యుడు ఉత్తరగతిని పొందినాడు .ఈ మాఘమాసం ప్రారంభించి శుక్ల పక్షం ఇంకా మూడు భాగాలు మిగిలి ఉన్నది. అని చెప్పడం వలన ఆ రోజు మాఘశుద్ధ సప్తమి సూర్యని ఉత్తరాయణ ప్రవేశ కాలమని పై శ్లోకం తెలియజేస్తుంది. 

మాహాభారత కాలంలో మాఘ శుద్ధ సప్తమినాడు అనగా రధ సప్తమి లేక సూర్య సప్తమి సూర్యుని రధం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుని అయన గతి మారేదని తెలుస్తుంది. మర్నాడే మాఘ శుద్ధ అష్టమి దీనినే భీష్మాష్టమి అని అంటారు. భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు. సరిగ్గా నేటి పరిస్థితికి 5056 సంవత్సరాలకు అవుతుంది. అనగా మహాభారత యుద్ధకాలం క్రీస్తు పూర్వం 3138 సంవత్సరాలకు జ్యోతిషుల లెక్కలకు సరిపోతుంది. దీని గురించి నా పి హెచ్ డి గ్రంధంలో వివరంగా తెలియజేసాను.

మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు. భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెపుతారు. కాల నిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాల మాధవీయం మున్నగు గ్రంథాలు మాఘ శుద్ధాష్టమిని భీష్మ నిర్యాణ దినంగా చెపుతున్నాయి. 

కార్తీక బహుళ అమావాస్యనాడు భారత యుద్ధ ప్రారంభ దినంగా భావించ బడుతుంది. కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు, కౌరవుల వద్దకు రాయబారానికి పయనమైనట్లు భారతంలో ఉంది. కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాటి గణనలో రేవతీ నక్షత్రం శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులున్నాడు. వస్తూ కర్ణునితో మాట్లాడాడు. సదరు సంభాషణలో శ్రీకృష్ణుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ప్రారంభం కాగలదని కర్ణునికి చెపుతాడు. భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టపరచ బడింది.

భీష్మాచార్యులు యుద్ధం చేసింది పది రోజులు. భారత యుద్ధం ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి 68 రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘశుద్దాష్టమి. అదీగాక భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధువధకు శంకిస్తాడు. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు, విజయునికి తత్త్వోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం యుద్దం ప్రారంభదినాన జరిగింది. ఆ దినాననే గీతా జయంతి ( భగవద్గీత పుట్టినదినం )గా జరపడం కొన్ని చోట్ల ఉంది. కనుక మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. పద్మ పురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ రోజు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్త్భుం తెలుపుతున్నది. 

కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది.  ‘‘వైయాఘ్య్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే వసూ రామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణే’’. అంటూ ఈ రోజున భీష్ములకు తర్పణం విడవాలని చెబుతారు. ఈ తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన.

రోజున ఎలా పూజ చేయాలంటే? :- సూర్యోదయమునకు ముందే ( ఐదు గంటలకు ) నిద్రలేచి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటుస్నానము చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి.

పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యమునకు పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణకవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా "ఓం నమోనారాయణాయ" అనే మంత్రమును 108 సార్లు జపించాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు.

పూజకు అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి. ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము, సత్యనారాయణ వ్రతము, బ్రహ్మోత్సవ దర్శనం, లక్షతులసిపూజ వంటివి నిర్వహించడం, పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ.