నాగుల చవితి
భారతీయ సంస్కృతిలో 'నాగుపాము'ను పూజించే సంప్రదాయం ఉంది. సర్పాలకు అధిపతి అయిన నాగరాజును నాగదేవతగా పూజిస్తారు. ఈ ఏడాది నవంబరు 18 బుధవారు నాడు నాగుల చవితి వచ్చింది
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
నాగుల చవితి దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో 'నాగుపాము'ను పూజించే సంప్రదాయం ఉంది. సర్పాలకు అధిపతి అయిన నాగరాజును నాగదేవతగా పూజిస్తారు. ఈ ఏడాది నవంబరు 18 బుధవారు నాడు నాగుల చవితి వచ్చింది. పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి "మూలాధారచక్రం"లో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.
ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి ( నువ్వులతో చేస్తారు ) అరటిపళ్ళు ప్రాంత ఆచార వ్యవహారంతో మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
పుట్ట దగ్గర చదువుకోవలసిన మంత్రం:-
అనంత
వాసుకి
శేష
పద్మ
కంబాల
కర్కోటకం
ఆశ్వతార
ధృతరాష్ట్ర
శంఖపాల
కలియా
తక్షక
పింగళ
నాగుల చవితి పూజా ముహూర్తం..
నాగుల చవితి పూజా ముహూర్తం సమయం: ఉదయం 11.03 నుంచి 01.09 వరకు
మొత్తం సమయం: 2 గంటల 6 నిమిషాలు
చవితి తిథి ప్రారంభం: ఈ రోజు ఉదయం 01.16 గంటలకు
చవితి తిథి ముగింపు: ఈ రోజు రాత్రి 11:15 గంటలకు
పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. వాస్తవానికి పాముకు పాలు అరగవు అవి తాగడానికి ఇష్టపడవు కాబట్టి పాముకు పాలను పుట్టలో పోయకుండా ఒక దొప్పలో పోసి పుట్ట దగ్గర పెట్టాలి. జంట నాగుల విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చును. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.