మకర సంక్రాంతి
పుష్యమాసంలో హేమంత ఋతువులో అతి చల్లని గాలులు, మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
సంక్రాంతి లేదా సంక్రమణము:- అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో వరుసగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందు వలన సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో హేమంత ఋతువులో అతి చల్లని గాలులు, మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి నెలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణలో అడుగు పెడతాడు. ఈ రోజు నుండే స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి.
ఉత్తరాయణం:- మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము అనబడుతుంది. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరి నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము అంటారు.
మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము.
ఖగోళ పరంగా :- మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడై తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో కనిపించుటచేత సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి అంటేనే పాతను వదిలి క్రొత్త దనానికి స్వాగతం పలుకే రోజు. ఈ రోజు సూర్యుని చుట్టూ పరిభ్రమించు భూమి దిశను సంక్రాంతితో సూర్యుడు కోంత ఉత్తరం వైపు మారును కాబట్టి ఈ కాలమును ఉత్తరాయణం అంటారు. ఈ కాలంలో సూర్యుని సంక్రమణముతో పాటు మానవ శరీరంలో భౌతిక పరమైన అనేక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ దృష్టిచేతనే ఈ పండగను సాంస్కృతిక పరమైన అద్భుత మహత్యము గల పర్వదినంగా మనకు పెద్దలు నిర్ధేశించినారు.
జ్యోతిషశాస్త్ర ప్రకారంగా :- సూర్యభగవానుడు ఏ రోజైతే మకరరాశిలో ప్రవేశిస్తాడో ఆ పుణ్యఘడియలను ఆ రోజు మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ ఖగోళ ప్రకారం సూర్యుడు తేది 15 జనవరి 2020 బుధవారము రోజు రాత్రి 2 : 08 ని॥లకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణ సమయం అయ్యే సరికి రాత్రి కావడం చేత మరసటి రోజు బుధవారం 15 తేదీ నాడు సూర్యోదయం నుండే మకర సంక్రాతి పండుగను శాస్త్రపరంగా ఆచరించాలి.
నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలి చలిగా ఉంటుంది. నెల రోజులు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా కనబడతాయి. హరిదాసులు, బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు, రకరకాల జానపద కళాకారులు వినోద ప్రజలకు వినోదాన్ని అందిస్తారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందు నుండే ప్రతీ రోజు ఇళ్ళ ముందు అందమైన ప్రత్యేక గీతల అల్లిక ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు.
ఈ పండగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు ( నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అని అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు.
ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఉదయాన్నే నుదుటన కుంకుమ బోట్టు పెట్టుకుని, నువ్వుల నూనెను గోరువెచ్చగా కాచి దానిని ఓళ్ళంతా మర్ధన చేసుకుని, నల్ల నువ్వులను కొన్ని తలపై వేసుకుని సున్నిపిండితో ఒళ్ళురుద్దుకుని తలంటుస్నానం చేయాలి. ఈ పండగకు కొత్త అళ్లుళ్లని, కూతుళ్లని ఇంటికి ఆహ్వానించుకుని కొత్త బట్టలు వేసుకుని దేవున్ని పూజించుకుని ప్రాంతాల వారిగా , కుటుంబ ఆచార, సాంప్రదాయకంగా వేడుక చేసుకుని పరమాన్నం, పిండి వంటలు, గుమ్మడి మొదలగు వాత హరములగు కూరగాయలు మొదలగునవవి భుజించి కుటుంబ సభ్యులతో ఆత్మీయులతో ఎంతో సరదాగా గడుపుతారు.
హరిదాసులు, హరికీర్తనలు రైతులకు పంటపోలాల నుండి ధాన్యం ఇంటికి వచ్చేకాలం, గంగిరేద్దుల విన్యాసాలు, హరిదాసులు ఇంటింటికి వచ్చి హరికీర్తనలు చేస్తూ ఆనంద పరుస్తారు, స్త్రీలు రకరకాల రంగులతో అందమైన ముగ్గులు ఇంటి ముందు వేసుకుని సంక్రాంతి నోములు, వ్రతాలు చేసుకుని నోములను ఇరుగు పోరుగువారికి ఆత్మీయులకు పంచుకుని దాంపత్య, కుటుంబ దోషాలను తోలగించుకుని దైవానుగ్రహం పొందామని సంతృప్తి చెందుతారు. పిల్లలు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. నోరూరించే పిండి వంటలు తీపి పదార్తలు,మొదలగు వాటిని దానం చేస్తారు.
మకర సంక్రమణం నుండి చలి క్రమక్రమంగా తగ్గును దేహపరంగా అనేకమైన మార్పు చోటు చేసుకుంటుంది. కాబట్టి ఋషులు మన ఆరోగ్య పరిరక్షణ కొరకు నువ్వులకు సంభందించిన పిండి వంటలను, నువ్వుండలు ( నువ్వుల ముద్దలు ) అరిశెలు, సకినాలు మొదలగు ఆహార పధార్ధాలు ఈ కాలంలో తింటే కంటికి, ఎముకలకు, చర్మమునకు, అనేకమైన ఆరోగ్య సమస్యలు నివారణ జరిగి ఆరోగ్య అభివృద్ది కలిగించే విటమిన్ "ఎ - బి" ఈ పదార్ధాల తినడం వలన ఆరోగ్య లాభలు కలుగుతాయి. మన ఆరోగ్యం కాపాడుట కొరకు గృహ వైద్య విధిగా ఈ పండగకు తినే పదార్ధలను పెద్దలు సూచన చేయడం జరిగినది.
సంక్రాంతి ప్రత్యేకతలు :-
1. సూర్యుడు తన కుమారుడైన శనిని కలిసే రోజు అంతే కాకుండా సూర్యుడు తన కోపాన్ని మర్చిపోయి తన కుమారుడు శనిని ఈ పండుగరోజు కలుస్తాడనే జానపదుల నమ్మకంలో ఉంది. కాబట్టి, స్వీట్లు పంచుతూ ప్రతి ఒక్కరూ ఆనందంతో గడపాలని చెప్తారు.
2. ఈ పండుగ చలికాలంలో రావడంచే నువ్వులు, బెల్లం తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి వంటికి వేడిని ఇచ్చే ఆహార పదార్ధాలు కాబట్టి బంధానికి మంచి ఆరోగ్యానికి గుర్తుగా ప్రత్యేకంగా ఈ స్వీట్లను పంచుతారు.
3.గాలి పటాలు ఎగుర వేయడం వెనుక చాలా కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా పగలే ఎగరేసేవారు ఎందుకంటే అప్పుడు సూర్య కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి, చల్లని గాలికి శరీరానికి ఎక్కువ ఇబ్బందిగా ఉండదు కాబట్టి గాలిపటాలు ఎగరేసేప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్య కిరణాలు తాకుతాయి. సూర్యకిరణాలు మన శరీరానికి, చర్మానికి చాలా ఉపయోగకరం. శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది.
4. మకరజ్యోతి దక్షిణ భారతదేశ కేరళలో ఈ రోజు ప్రత్యేకమైన రోజున కష్టతరమైన కటువైన దీక్షతో మండలం రోజులు దీక్ష చేసి శబరిమల యాత్ర చేసిన భక్తులకు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చేరోజు. దేశంలో కొన్ని ప్రాంతాలలో తమ పాపాలను పోగొట్టుకోవడానికి నదుల్లో పవిత్ర స్నానాలను చేసి ఈ పండుగను జరుపుకుంటారు.
5..మకర సంక్రాంతి రోజున విధి వశాత్తు మృత్యువు సంభవిస్తే వారికి పున:ర్జన్మ అనేది ఉండదు, నేరుగా స్వర్గానికే వెళ్తారని నమ్మకం కూడా ఉంది. భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్య ఘడియలు వచ్చే వరకు వేచి ఉండి ఈ పుణ్య ఘడియలలోనే ముక్తి పొందాడు.