డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మనుషులు ఈ సంసారసాగరము నుండి తమను తామే ఉద్దరించుకోవాలి. తమకు తామే స్వయం కృతాపరాధం వలన అధోగతిపాలు కాకూడదు. ఇది ఎలాగంటే ఈ లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. మన కర్మలే మనల్ని తత్కర్మానుసారంగా ఫలితాలు అనేవి అనుభవింప జేస్తాయి. భూమిలో విత్తు ఏదైతే నాటుతామో దానికి సంబంధించిన ఫలం సహజంగా ఎలా వస్తుందో...మనం చేసిన కర్మలకు మనమే భాధ్యులం అవుతాము. ఈ విషయమే శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఏం చెప్పాడో గమనిద్దాం.

భగవద్గీతలోని ఆరవ అధ్యాయం, ఐదవ శ్లోకం 

            "ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ 
             ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః "

ఉద్ధరేత్ — ఉద్ధరించుకోనుము;
ఆత్మనా — మనస్సు ద్వారా;
ఆత్మానం — నిన్ను నీవే;
న — కాదు; 
ఆత్మానం — నిన్ను;
అవసాదయేత్ — పతనం చేసుకొనుట;
ఆత్మా — మనస్సు;
ఏవ — ఖచ్చితంగా;
హి — నిజముగా;
ఆత్మనః — మన యొక్క;
బంధు: — మిత్రుడు;
ఆత్మా — మనస్సు;
ఏవ — నిజముగా;
రిపుః — శత్రువు;
ఆత్మనః — మన యొక్క.

భావం :-నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవుతుంది, ఈ సత్యాన్ని గ్రహించాలి.

ఈ జన్మకు ముందు మనకు అనంతమైన జన్మలు గడిచిపోయాయి మరియు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఈ భూమిపై ఎల్లప్పుడూ ఉన్నారు. ఏ సమయంలో అయినా ఈ లోకంలో అటువంటి మహాత్ములు లేకపోతే జీవులు భగవత్ ప్రాప్తి పొందలేరు. మరైతే వారు భగవంతుడిని పొందే తమ జీవిత లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? అందుకే దేవుడు చిత్తశుద్ధిగల సాధకులకు దిశానిర్దేశం చేయటానికి మానవ జాతికి స్ఫూర్తినివ్వటానికి భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ప్రతి కాలంలో ఉండేట్టుగా చూసుకుంటాడు. 

కాబట్టి అనంతమైన పూర్వ జన్మలలో చాలా సార్లు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములను కలిసే ఉంటాము, అయినా భగవత్ ప్రాప్తి పొందలేక పోయాము. అంటే సరియైన మార్గదర్శకత్వం లేకపోవటం సమస్య కాదు, దానిని స్వీకరించక పోవటం లేదా దానిని ఆచరించక పోవటమే సమస్య. ఈ విధంగా మన ప్రస్తుత అధ్యాత్మిక స్థాయి పురోగతికి లేకపోవటానికి మనమే భాద్యత తీసుకోవాలి. అప్పుడే మనకు, మన ప్రస్తుత పురోగతి స్థాయి మన ప్రయంత్నం ద్వారానే సాధించాము మరింత పరిశ్రమ ద్వారా మనలను ఇంకా ఉద్ధరించుకోవచ్చు అన్న ధైర్యం వస్తుంది.

జీవుడు ఆజ్ఞానవశమున అనాది కాలమునుండి ఈ దుఃఖమయ సంసార సాగరమున మునకలు వేయుచూ.. నా నా విధాలుగా జన్మల నెత్తుచూ భయంకరమైన అనేక దుఃఖాలకు లోనగుచున్నాడు. జీవుని ఈ దీనదశను చూసి పరమాత్ముడు సాధనకు అనుకూలమైన అవకాశాన్ని ఇస్తూ మంచి తరునోపాయాలను సూచిస్తూ మానవ జన్మను ప్రసాదిస్తాడు.  ఆ శరీరంతో జీవుడు తగిన సాధన ద్వారా ఒకే ఒక్క జన్మయందు సంసార సముద్రము నుండి బయటపడి పరమానంద స్వరూపుడైన పరమాత్మను సహజంగా పొందవచ్చును.

కానీ మానవుడు దీనికి వ్యతిరేఖంగా రాగద్వేషాలు, కామక్రోధ లోభామోహాది దోషాలలో చిక్కుకుని ..అనేక దుష్కర్మలను ఆచరించుచుండును. తత్ఫలితంగా మానవ జీవిత పరమలక్షమైన భగవత్ ప్రాప్తిని పొందలేకపోవుట.. దుష్కృత ప్రభావమున క్రమంగా మనిషి సుకర సునాకాధి జన్మల నెత్తుట జరుగుచున్నది. తనను తాను అధోగతి పాలు చేసికొనుమట జరుగుచున్నది. ఇదే విషయం ఉపనిషత్తులలో మనుష్యులు ఆత్మ హంతకులు అని పేర్కొని వారి దుర్గతిని వర్ణించడం జరిగినది.