మానవులకు ముక్తిని ప్రసాదించే సప్త పుణ్య స్థలం

శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా, సత్కర్మలు - పుణ్యకార్యాలు ఎన్ని చేసినా దేవతలను ఎంతగా పూజించినా ముక్తిలేదు. 

Sapta Punya is a place of salvation for human beings

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ముక్తి అంటే ఏమిటి..? సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. అందుకే అంటారు. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది? వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? అని, అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. సామాన్యంగా మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు. 

శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా, సత్కర్మలు - పుణ్యకార్యాలు ఎన్ని చేసినా దేవతలను ఎంతగా పూజించినా ముక్తిలేదు. వందమంది 'బ్రహ్మల' కాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు అని. మరి ఎలా వస్తుంది? 'ఆత్మైక్య బోధేన'  నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు. 

పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. అయితే ముక్తి పొందాలనుకున్నవారు మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి నిష్కామంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం.   

'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః’

 ఈ శ్లోకం అర్థం: - అయోధ్యా, మధుర, మాయ ( హరిద్వార్), కాశీ, కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు ( నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
     
1) అయోధ్య:- అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.

2) మధుర:- మధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.

3) మాయ:- దీనినే హరిద్వార్‌ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగు మోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.

4) కాశీ:- భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు.

5) కాంచీపురం:- దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తిస్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.

6) అవంతిక:- భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయినీ నగరానికే అవంతిక అనిప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథు డైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

7) ద్వారవతి:- అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్‌గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios