స్వరాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలా ఒక రకంగా మత్స్య విప్లవమే తెచ్చింది, వీలుంటే, మత్స శాఖ బాలామణి గారు వేసిన ఈ చిత్రాన్ని తమ కార్యాలయాల్లో అలంకరించుకోవడం గొప్పగా ఉంటుంది.

+++

మూడు చేపలు నీళ్ళల్లో ఈదులాడుతున్నట్టు కనిపించే ఈ ముగ్గు నిజానికి ఒక సాంసృతిక చిహ్నం. మత్వ్సకారులు తమ రాజ ముద్రగా అలంకరించుకోదగిన అరుదైన ప్రతీక. కనుమ రోజునే కానవచ్చే ఈ చిత్రాన్ని గురించి ఈ రోజే తప్పక చెప్పుకోవాలి.

 

ఇది వాకిట్లోని ముగ్గు. దీన్ని హైదరాబాద్ లోని పార్సీగుట్టలో, గంగపుత్ర కాలనీలో నివసించే బాలమణి గారు ఆరేళ్ళ క్రితం వేశారు. అప్పట్లో వారింటి ముందే మేముండేవాళ్ళం. చూడగానే ఒక విస్మయం. వెంటనే వెళ్లి కలిశాను. దాదాపు ముఖాముఖి వంటిదే చేశాను.

 

‘ఒకే కన్ను…మూడు చేపల’ ఈ ముగ్గును తాను స్వయంగా ఊహించి చిత్రించించారని చప్పారు.  దాదాపు పదిహేనేళ్ళ క్రితం తొలిసారిగా వేశారని బాలమణిగారు వివరించారు.

 

"ఇది మీరే సృష్టించారా?’ అన్న ప్రశ్న తనకు నచ్చలేదు. “సృశించడం ఏమిటి?” అన్నారు. 'ఇది సృష్టికాదు. అసలు మనం దేన్నయినా సృష్టించగలమా?’ అని తిరిగి ప్రశ్నించడం విశేషం.  

 

ఐతే, ఒక క్షణం ఆగారు. ఆగి చెప్పారు...‘మేం గంగపుత్రులం. ‘చేప మా కులదేవత’ అన్నారు. ‘చేపల్ని మనం సృష్టిస్తమా?’ అని కూడా అన్నారావిడ.
 

బాలమణి గారు చాలా తక్కువగా మాట్లాడారు. ప్రత్యేకంగా ఫోటో దిగడానికి అస్సలు ఒప్పుకోలేదు. వారి మాటల్లో తాను నిలుపుతున్న సాంస్కృతిక అస్తిత్వం అన్న సొయి లేదు. ఈ బొమ్మ ద్వారా తాను చాటుతున్న ఘన వారసత్వం కూడా కానరాలేదు. కేవలం ఆమె మాటల్లో ఒక మహిళ ఆర్తి ఉన్నది. జీవితమంత భక్తితో, ప్రేమతో ఆమె "మేం గంగపుత్రులం" అనడంలో మొత్తం ఉంది.  ఆ మొత్తం ఆత్మ గౌరవాన్ని పట్టించే బొమ్మ గీయడం ఒక సహజ వికాసం వలే అనిపించంది. 

 

బహుశా ఆమె అందరి మహిళల మాదిరే ఆ రోజు ఆ ముగ్గు వేసింది. కానీ తమ జీవితానికి ఆధార భూమిక ఐన చేప ముగ్గును గీయడంలో తమ ఇంటికి సిసలైన సంపద ఏమిటో చెప్పకుండానే చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.

 

నిజానికి ఆ ముగ్గును చూస్తుంటే అది ఎంతమాత్రం ప్రదర్శన కాదని తెలిసింది. ఒక నిశబ్ద అంతర్వాణి ఆ చిత్రంలో ధ్వనిన్చినట్టు తోచింది. అప్పటిదాకా వినడమే గానీ,  ‘స్త్రీలు నిజమైన సాంస్కృతిక రాయబారులు’ అన్న భావన బాలామణి గారిని చూశాక, ఆమె చేప బొమ్మ గురించి చాల వినయంగా “నాదేముంది” అంటూ వివరించడంతో ద్రువపడింది.
 

సరిగ్గ కనుమ రోజున ఆమె ఈ చిత్రం వాకిట్లో గీయడం విశేషం. నిజానికి ఆ నాడు అందరి వాకిళ్లలో రథం ముగ్గు ఊరేగుతుండగా బాలమణి గారి ఇంటి ముందు మాత్రం ఈ ‘మత్య్సం’ మూడు పువ్వులుగా వికసించడం నిజంగా అబ్బురపరిచింది.
 

ఆ తర్వాతి ఏడాది కూడా ఆ చేప ముగ్గునే వారు చిత్రించారు. కానీ మరో ఏడాది గడిచే టప్పటికి వారు ఇల్లు మారారు. దాంతో బాలామణి గారిని మళ్ళీ చూసే అదృష్టం దొరకలేదు. ఆమె బొమ్మని కూడా.

 

నిన్న తిరిగి గంగ పుత్ర కాలనీలో వారి గురించి అరా తీశాను గానీ లాభం లేదు.  కాలనీలో తిరుగుతుంటే మరో చేప బొమ్మ కనిపించింది. అది ముగ్గు కాదు, జస్ట్ చేప బొమ్మ. రాం నగర్ చేపల మార్కెట్ నుంచి గంగాపుత్ర కాలనీలోకి వెళ్ళే మొదట్లో దీన్ని చిత్రించారు. కానీ దీనికీ బాలామణి గారి బొమ్మకు ఆస్మ్నాన్ ఫరక్ ఉందని చెప్పనవసరం లేదు.

 

ఏమైనా, బాలామణి చిత్రానికి సాటి వచ్చే ముగ్గు మనం ముందు ముందు చూస్తామో లేదో తెలియదు. కానీ, తానైతే తప్పక ఈ ముగ్గు గీస్తూనే ఉంటారు. ఈ రోజు కనుమ. ఖచ్చితంగా వారు ఎక్కడున్నా తమ వాకిట్లో ఈ ముగ్గు తప్పకుండా వేస్తారు.

 

బాలామణి గారు ఏ విశేషం లేకుండా ఆ ముగ్గును వేస్తారుగానీ, ప్రతి మత్సకారుల బిడ్డ ఈ బొమ్మను చూడవలసిందే.

స్వరాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలా ఒక రకంగా మత్స్య విప్లవమే తెచ్చింది, వీలుంటే, మత్స శాఖ ఈ చిత్రాన్ని తమ కార్యాలయాల్లో అలంకరించుకోవడం గొప్పగా ఉంటుంది.

 

చేపల మార్కెట్ లో ఇటువంటి బొమ్మలు ఎన్నైనా ఉండనీ. ఆమె గొప్ప అమెదే.

 

కనుమ రోజున కూడా రథం ముగ్గు బదులు చేపల ముగ్గే గీసే బాలామణి గారు నిజమైన    సాంస్కృతిక సారథి. నిజమైన గంగమ్మ. ఆమెకు నమస్సులు తెలపడం ఒక కృతజ్ఞత. మన విధి.


 

-కందుకూరి రమేష్ బాబు

వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్టు, పోటోగ్రాఫార్.