ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు సాధారణం అయిపోయాయి. అమ్మనాన్నాల అనుమతి లేకుండా పారిపోయి పెళ్లి చేసుకున్న వాళ్లు కొందరైతే.. కాస్త ఆలస్యమైన తల్లిదండ్రుల అనుమతితో చేసుకునే వారు మరికొందరు. అయితే ఈ ప్రేమ పెళ్లిళ్లు ఇప్పుడే కాదు.. పురాణాల్లో కూడా ఉన్నాయి.

ప్రేమ ఇద్దరు వ్యక్తులను దగ్గర చేస్తుంది. జీవితాంతం వారిని కలిసి ఉండేలా చేస్తుంది. చాలామంది ప్రేమికులు పెళ్లితో వారి జీవితాన్ని సంతోషంగా మొదలు పెడతారు. అయితే రకరకాల కారణాలతో కొందరు తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవచ్చు. దానివల్ల చాలామంది ప్రేమికులు పేరెంట్స్ కి తెలియకుండా పారిపోయి పెళ్లిచేసుకుంటున్నారు.

ప్రేమ పెళ్లి ప్రస్తుతం చాలా సాధారణం అయిపోయింది. అయితే ఈ పెళ్లిళ్లు ఇప్పుడే కాదు. పురాణాల్లోనూ ఉన్నాయి. మన పురాణాల్లో ఆదర్శ పురుషులుగా చెప్పుకునే చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. మహాభారతంలో కూడా తను ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న మహా యోధులు ఉన్నారు. మరి పురాణాల్లో ప్రేమ పెళ్లి చేసుకున్నవారు ఎవరో ఇక్కడ చూద్దాం.

పురాణాల్లో ప్రేమ పెళ్లి చేసుకున్నది ఎవరు?

1) దుష్యంతుడు - శకుంతల

నిజానికి దుష్యంతుడు, శకుంతల పారిపోలేదు. కానీ అమ్మానాన్నల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారు. వేట కోసం వచ్చిన చంద్రవంశ రాజు దుష్యంతుడు, కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలను చూస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. తనను పెళ్లి చేసుకోవాలని దుష్యంతుడు.. శకుంతలను అడుగుతాడు. 

కానీ అప్పుడు కణ్వ మహర్షి పాతాళంలో ఉండటం వల్ల... ఆయన అనుమతి లేకుండా పెళ్లి చేసుకోలేను అని శకుంతల చెబుతుంది. కానీ గాంధర్వ వివాహం అనేది ఉంది. దాని ప్రకారం ప్రేమికులు కుటుంబం లేకుండానే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి దుష్యంతుడు శకుంతలను ఒప్పిస్తాడు. అలా ఇద్దరూ అడవిలోనే పెళ్లి చేసుకుంటారు. వీరికి పుట్టినవాడే భరతుడు.

2) కృష్ణుడు - రుక్మిణి

విదర్భ రాజు భీష్మకుడి కూతురు రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. భీష్మకుడి కొడుకు రుక్మి.. జరాసంధుడికి మిత్రుడు. కృష్ణుడు, రుక్మిణి ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ రుక్మి ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉంటాడు. రుక్మిణి.. కృష్ణుడికి ఉత్తరం ద్వారా పెళ్లి గురించి చెబుతుంది. ద్వారకకు సమాచారం అందగానే కృష్ణుడు తన అన్న బలరాముడితో విదర్భకు బయలుదేరుతాడు. అక్కడ రుక్మితో యుద్ధం చేసి రుక్మిణిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు.

3) అర్జునుడు - సుభద్ర

కృష్ణుడి సలహాతో.. బలరాముడి అనుమతి లేకుండా సుభద్రను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు అర్జునుడు. బలరాముడు తన చెల్లెలు సుభద్రను దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ కృష్ణుడికి ఇది ఇష్టం ఉండదట. అర్జునుడు, సుభద్ర ప్రేమించుకుంటున్నారని తెలిసిన కృష్ణుడు.. పారిపోయి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడట. ఆ సలహాతో అర్జునుడు, సుభద్ర పెళ్లి చేసుకుంటారు. వీరి కొడుకే అభిమన్యుడు.

4) సాంబుడు - లక్ష్మణ

పురణాల ప్రకారం కృష్ణుడి ఎనిమిది మంది భార్యల్లో జాంబవతి ఒకరు. జాంబవతి, కృష్ణుడి కొడుకే సాంబుడు. సాంబుడు.. దుర్యోధనుడు, భానుమతి కూతురు లక్ష్మణను ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ దుర్యోధనుడు తన కూతుర్ని కృష్ణుడి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడు. అందుకని సాంబుడు ఒకరోజు లక్ష్మణను ఎత్తుకెళ్లి.. ద్వారకకు తీసుకెళ్తాడు. 

ఆ విషయం కౌరవులకు తెలిసి సాంబుడి మీద యుద్ధం చేసి అతన్ని బంధిస్తారు. కృష్ణుడు, బలరాముడు హస్తినాపురానికి వెళ్తారు. బలరాముడు తన నాగలితో హస్తినాపురాన్ని గంగానదిలో ముంచడం మొదలు పెడతాడు. భయపడిన కౌరవులు క్షమాపణ చెబుతారు. తర్వాత ద్వారకలో సాంబుడు, లక్ష్మణ పెళ్లి జరుగుతుంది.