శ్రీకృష్ణుని అష్టభార్యలు

ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు. మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. 

AshtaBharya  Names of 8 Wives of Lord Krishna

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

AshtaBharya  Names of 8 Wives of Lord Krishna


కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణపరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పరమాత్మ తత్త్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేది. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత ఇతర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునునియందు ప్రీతి ఎక్కువ. ఆయన అర్జునునకు సారధ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనక ఉన్న రహస్యం వేరు.

"యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః!
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ!"

ఎక్కడయితే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో, అక్కడ మన వెనక కూర్చుని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి, ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు. మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమయిన మృగములను వేటాడి డస్సిపోయారు. దాహం వేసింది. ఇద్దరూ యమునా నదిలోని నీటిని దోసిళ్ళతో తీసుకుని త్రాగారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నింటిని ఇంద్రప్రస్థమునకు పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. 

ఆవిడ నిండు యౌవనంలో ఉన్నది. మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు. ‘అమ్మా నీవు చాలా అందగత్తెవి. మంచి యౌవనములో ఉన్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా ఉన్నావు. నీవు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది’ అని అడిగాడు. ఆవిడ ఒక చిత్రమయిన జవాబు చెప్పింది. ‘నేను సూర్య నారాయణ మూర్తి కుమార్తెను. నన్ను కాళింది అని పిలుస్తారు. నేను యమునానదిలో  ఉంటాను. నేను జన్మించినప్పుడు నాతండ్రి ఒకమాట చెప్పాడు. యమునానది ఒడ్డున ఒకరోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్ళు త్రాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు. చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు’ అని మా తండ్రిగారు నాకు చెప్పి ఉన్నారు. 

నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను’ అని చెప్పింది. అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి ‘వారే కృష్ణ భగవానుడు’ అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు. కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది. ఆతరువాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఖాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్ళారు. ఖాండవ వన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాండీవమును,  అక్షయ బాణ తూణీరములను అర్జునునకు బహూకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన ఇంత సామగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు.

ఆర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలచుకున్నాడు. అదీ శ్రీకృష్ణుని గొప్పతనం. తదనంతరము నందు మయుడనే రాక్షసుడు ఖాండవవనం దహింప బడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు.
అవంతీ రాజ్యమును విందానువిందులు అనబడే వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాధిదేవి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త. ఆవిడకి ఒక కుమార్తె ఉన్నది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులయిన విందానువిందులు దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్లకి కౌరవులంటే ప్రీతి. కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురయిన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని, రాజులందరిని పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు.

కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు నాగ్నజితి. ఆయన ఒక చిత్రమయిన షరతు పెట్టాడు. ‘నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర వున్న ఏడుపొగరు మోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని యిచ్చి వివాహం చేస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యమును చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు.

కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉన్నది. ఆవిడ పేరు శ్రుతకీర్తి. శ్రుతకీర్తికి ఒక కుమార్తె ఉన్నది. ఆమెపేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు. తదనంతరము మద్రరాజు కుమార్తెయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు. అలా భగవానుడికి ఎనమండుగురు భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుతున్నాడు. ఎనమండుగురు భార్యలని చెప్పడం వెనక ఒక రహస్యం ఉన్నది. యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరససల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం.

భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు. భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములయిన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది. ఈశ్వర చైతన్యం లేకపతే ఎనిమిది వస్తువులు జడం అయి ఉండిపోతాయి. ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది.

"భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ!
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా!!"

అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు. మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము. ఈశ్వరుడు పురుషుడై జడమయిన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు. ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వరుడు లేకపోతే శివము శవము అయిపోతుంది. ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు.  కృష్ణుడు ఎనమండుగురినే చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిదిమంది. ఇదీ అందులో ఉన్న రహస్యం. జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది.  భాగవతమును రెండుగా వినాలని చెపుతారు. అర్థమయిన చోట జ్ఞానిగా వినాలి. అర్థం కాని చోట భక్తునిగా వినాలి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios