నగల కోసం గర్భిణిని చంపి.. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు సూట్‌కేసులో కుక్కిపడేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌‌ బిస్రాఖ్ ప్రాంతంలో మాలా, శివంకు ఇటీవలే వివాహం అయ్యింది. ఇటీవల వీరింటికి దగ్గరి బంధువులు రావడంతో తన వద్ద ఉన్న నగలను మాలా వారికి చూపింది.. ఈ సమయంలో పొరిగింట్లో ఉంటున్న రితూ అనే మహిళ కూడా పక్కనే ఉంది.

దీంతో ఆమెకు ఆ నగలను ఎలాగైనా కాజేయాలనే కోరిక కలిగింది. ఇంటికి వెళ్లి తన భర్తకు విషయం చెప్పింది. దీనికి ఇద్దరు కలిసి పథకం పన్నారు.. తర్వాతి రోజు ఉదయం శివం ఏదో పని మీద బయటకు వెళ్లాడు.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మాలాను రీతూ దంపతులు తమ ఇంటికి ఆహ్వానించేందుకు వెళ్లారు. వెంటనే మాలాను గొంతు నులిమి చంపారు.. అనంతరం ఆమె సూట్‌కేసులో దాచుకున్న నగలను, సెల్‌ఫోన్‌ను తీసుకుని మృతదేహాన్ని అదే సూట్‌ కేసులో కుక్కిపెట్టారు.

అనంతరం మృతదేహాం ఉన్న సూట్‌కేసును తీసుకుని ఘజియాబాద్‌కు సమీపంలోని ఇందిరాపురంలో పడేశారు. అనంతరం నిందితులిద్దరూ బంధువుల ఇంటికి వెళ్లారు. మరోవైపు భార్య ఆచూకీ లభించకపోవడంతో శివం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకు ముందే ఇందిరాపురం ప్రాంతంలో ఓ సూట్‌కేసులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించినట్లు పోలీసులకు సమాచారం అందింది.

శివం చెప్పిన ఆనవాళ్లతో సరిపోలడంతో ఆ మృతదేహం మాలాదేనని పోలీసులు నిర్థారించారు. తొలుత ఈ హత్య ఆమె భర్తే చేశాడని మాలా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో శివం విధుల్లో ఉన్నాడని తేలడం.. మాలా కనిపించని రోజు నుంచి పొరుగింట్లో ఉంటున్న దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలియడంతో.. ఈ హత్య వారే చేశారని ధ్రువీకరించుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నిందితులిద్దరినీ నగలతో సహా పోలీసులు పట్టుకున్నారు.