ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటారు. అందుకు అవసరమైన ఆహారాన్ని వారికి అందిస్తారు. అయితే చాలామంది పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల ఉండదు. అందుకు కారణాలు, పరిష్కారాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్లో ఎదుగుదల లోపం కనిపిస్తోంది. వయసుకు తగ్గ పొడవు, బరువు ఉండటం లేదు. పదో తరగతి చదువుతున్న పిల్లలు ఆరో తరగతి చదివే పిల్లల్లా కనిపిస్తున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ చూద్దాం.

పిల్లల్లో ఎదుగుదల లోపం రావడానికి కారణాలు

పోషకాహార లోపం

పిల్లల్లో సరైన ఎదుగుదల లేకపోవడానికి అన్ని రకాల పోషకాలు కలిగిన సమతుల్య ఆహారం అందకపోవడం ప్రధాన కారణం. పిల్లలు పొడవుగా పెరగడానికి ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ డి వంటి పోషకాలు చాలా అవసరం. ఖచ్చితంగా ఉదయం అల్పాహారం తీసుకోవాలి. చాలామంది పిల్లలు స్కూల్ కి వెళ్లే హడవిడిలో సరిగ్గా బ్రేక్ ఫాస్ట్ చేయరు. అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదు.

తినకూడని ఆహారం

చిప్స్, చక్కెర పానీయాలు, వేపుళ్లు వంటివి తినకపోవడం మంచిది.

హార్మోన్ల అసమతుల్యత

పిల్లలకి పోషకాహారం ఇచ్చినా.. ఎదుగుదల లేకపోతే అది హార్మోన్ల అసమతుల్యత కావచ్చు. శరీరంలోని ప్రధాన గ్రంథి అయిన పిట్యూటరీ గ్రంథి పిల్లలు పొడవుగా పెరగడానికి కారణం. పిల్లలకి పోషకాహార లోపం లేదా మానసిక ఒత్తిడి ఉంటే అది ఎదుగుదల హార్మోన్ ఉత్పత్తిని ఆపుతుంది.

శారీరక శ్రమ

ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటూ, పరిగెడుతూ ఉండేవారు. కానీ ఈ తరం పిల్లలు సెల్ ఫోన్ చూడటంలో మునిగిపోతున్నారు. పరిగెత్తడం, ఆడుకోవడం, చెట్లెక్కడం వంటి బయటి ఆటలు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. బయట ఎండలో ఆడుకున్నప్పుడు ఎముకల పెరుగుదలకు అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.

నిద్రలేమి

రాత్రిపూట గాఢనిద్రలో ఉన్నప్పుడే ఎదుగుదల హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వంటివి చేస్తూ రాత్రిపూట కూడా మేలుకుంటున్నారు. దీనివల్ల వారి ఎదుగుదల హార్మోన్ సరిగ్గా పనిచేయదు.

పిల్లలు పొట్టిగా ఉండటానికి వాళ్ల జన్యువులు కూడా కారణం కావచ్చు. ఇది వాళ్ల వంశపారంపర్య లక్షణం కావచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పొడవుగా ఉన్నా, పిల్లలు పొట్టిగా ఉండే అవకాశం ఉంది. దీనికి చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఒత్తిడి వంటివి కారణం కావచ్చు.

పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఏం చేయాలి?

పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. ప్రతిరోజూ పిల్లలు తినే ఆహారంలో ప్రోటీన్ ఉండాలి. గుడ్లు, పాలు, పప్పు ధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు వంటివి పిల్లలకి ప్రతిరోజూ ఇవ్వాలి. ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ ని తినకుండా చూడాలి. రోజూ సరైన సమయానికి నిద్రపోయేలా చూసుకోవాలి.

ఇంట్లో ఉండటం కంటే బయట ఆడుకోవడాన్ని ప్రోత్సహించండి. పిల్లలకి ఏదైనా విటమిన్ లోపం ఉందా అని పరీక్ష చేయించి దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లను మార్చండి. ఈ విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.