ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అపారమైన ప్రేమానురాగాలు కొనసాగుతున్నాయి అనేది బయట వినిపిస్తున్న మాట. జగన్ హైదరాబాద్ వచ్చినా, కెసిఆర్ విజయవాడ వెళ్లినా వారికి లభించే ఆత్మీయ స్వాగతాన్ని కవర్ చేయడానికి మీడియా కెమెరాలు కూడా సరిపోవు. జగన్ హైదరాబాద్ లోని భవనాలను ఖాళీ చేసి కెసిఆర్ కు అప్పగించడం నుంచి మొదలుకొని కృష్ణ గోదావరి అనుసంధాన చర్చల వరకు అన్ని పరిణామాలను గమనించినా మనకు ఇలానే అనిపిస్తుంది. 

కాకపోతే మొన్న కేసీఆర్, ప్రెస్ మీట్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సర్కార్ తీసుకున్న ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని చాలా ఘాటుగా తప్పుబడుతూ "ఏమైంది? మన్నయింది!" అని అన్నాడు. దీన్నే అదునుగా చేసుకొని చంద్రబాబు నిన్న ఒక సభలో మాట్లాడుతూ, ఆప్త మిత్రుడు కెసిఆర్ కి కూడా జగన్ చులకనైపోయాడంటూ కెసిఆర్ ప్రెస్ మీట్ ని ఉటంకిస్తూ అన్నాడు. 

రాజకీయంగా జగన్ ని చులకన చేసే పనిని చంద్రబాబు భుజానికి ఎత్తుకున్నట్టుగా కనపడుతుంది. గతంలో వైసీపీ కూడా ఇలా చంద్రబాబును చులకన చేసిన సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో జగన్ జాగ్రత్తపడుతున్నట్టుగా, కెసిఆర్ పట్ల ఒకింత ఆచితూచి వ్యవహరించే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. 

Also read: కేసీఆర్ తో వైఎస్ జగన్ దోస్తీ కటీఫ్: అసలేమైంది?

మొదటగా అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందనేది చూద్దాం. కేసీఆర్ మొన్నటి ప్రెస్ మీట్ లో జగన్ పై దాడి చేయడానికి అలా ఘాటుగా వ్యాఖ్యానించలేదు.  ఫ్రస్ట్రేషన్ వల్ల బయటకొచ్చిన మాటలు. జగన్ రోజు రోజుకు కేసీఆర్ కు నూతన తల నొప్పులు తెచ్చి పెడుతున్నాడు. ఒక దాని తరువాత ఒక్కటిగా ఇవి ఎక్కువవుతూ ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనపడడం లేదు. 

తెలంగాణాలో గతంలో మాట్లాడుకున్నట్టు ఆర్టీసీ సమ్మెకు ట్రిగరింగ్ పాయింట్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా జగన్ తీసుకున్న ఆర్టీసీ విలీన నిర్ణయమే. వెనువెంటనే తెలంగాణ కార్మికులు సైతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండును ఎత్తుకొని సమ్మెకు దిగారు. 

ఒక పక్కనేమో కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తుంటే జగన్ సర్కార్ ఏమో ఆర్టీసీని విలీనం చేసి ఏపిఎస్సార్టీసీ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంటు ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాడు. తద్వారా ఆర్టీసీ కార్మికులందరికీ ఇతర ప్రభుత్వోద్యోగుల మాదిరే పూర్తి అలవెన్సులు,జీతాలు అందుతాయి. 

మొన్నటి ప్రెస్ మీట్ లో ఈ విషయంపై ప్రశ్నించగానే కెసిఆర్ అది ముందుకు పోదు. అటకెక్కుద్ది అని అన్నాడు. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి జగన్ మడిమ తిప్పడు ,మాట తప్పుడు అని చెప్పాడు. జగన్ కమిట్మెంటును ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. జగన్ చెప్పింది చెప్పినట్టుగా అమలు చేస్తున్నాడు. నవరత్నాలకు పెద్దపీట వేస్తున్న విషయం మనమందరం చూస్తున్నాము కూడా. 

ఆంధ్రేప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని నిన్న ఇదే విషయమై మరోసారి మాట్లాడుతూ కేసీఆర్ మాటలను చాల సాఫ్ట్ గా ఖండించారు. కేసీఆర్ మాటను ఛాలెంజ్ గా తీసుకొని మూడు నెలల్లోపే విలీనం పూర్తి చేస్తామని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలకు ఎక్కడా తావివ్వకుండా జగన్ సర్కార్ జాగ్రత్త పడుతుందనేది వాస్తవం. 

Also read: RTC Strike: కేసీఆర్ వ్యాఖ్యలపై కసి పెరిగిందన్న పేర్ని నాని

జగన్ ఇలా పథకాలను పెడుతూ పోతూ ఉంటె తెలంగాణ సమాజం కూడా అడగడం మొదలుపెడుతుంది. తన రైతు బంధు గురించి గొప్పలు చెప్పుకునే కెసిఆర్ కు ఇప్పుడు ఆ ఆస్కారం లేకుండా పోయింది. జగన్ ఇంకో రెండు వేలు ఎక్కువగా ఇస్తున్నాడు. అమ్మఒడి,వాహన మిత్ర వంటి పథకాలు అక్కడ ఉన్నాయి. తెలంగాణాలో లేవు. తెలంగాణాలో ఉన్న ప్రతి పథకం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కేసీఆర్ ఈ విషయంలో డిఫెన్సులో పడ్డాడు. కేసీఆర్ ఇచ్చిన ఎన్నో హామీలు అటకెక్కాయి కూడా. 

ఈ నేపథ్యంలో కెసిఆర్ లో ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువైతే, తన మీదికి ప్రజాగ్రహం రాకుండా ఉండడం కోసం వైఎస్ జగన్  పథకాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తాడు. ఇప్పటికే తెలంగాణాలో నవంబర్ నెల జీతాలు ఇవ్వడం కోసం రైతుబంధు డబ్బులను ఆపారు. పథకాల అమలు విషయంలో పేద రాష్ట్రం,అప్పుల్లో ఉన్న రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ దూకుడుగా వ్యవహరిస్తుంటే, మిగులు బడ్జెట్ ఉన్నరాష్ట్రం, ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఎందుకు సాధ్యపడదు అని ప్రజలు ప్రశ్నించే ఆస్కారం లేకపోలేదు. ప్రజలు ప్రశ్నించుకున్నా విపక్షాలు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. 

Also read: కేసీఆర్ కు మరో తలనొప్పి పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్

ఈ నేపథ్యంలో కెసిఆర్ మరింత ఘాటుగా జగన్ పథకాలపై స్పందించినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఒకింత జాగురూకతతో వ్యవహరిస్తున్నట్టు మనకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అర్థమవుతుంది. 

గోదావరి, కృష్ణ నదుల అనుసంధానానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక మూడు సార్లు చర్చలు జరిపారు. ఉమ్మడిగా ఈ అనుసంధానం చేపట్టాలని తొలుత భావించినా, జగన్ మాత్రం మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. 

 ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది కాబట్టి నష్టమేమీ ఉండకపోవచ్చునని, అయితే భవిష్యత్తులో అలాంటి వాతావరణం ఉంటుందని చెప్పలేమని, స్నేహ సంబంధాలు దెబ్బ తింటే చేసిన వ్యయానికీ పొందే ప్రయోజానానికి మధ్య పొంతన కుదరకపోవచ్చునని అంటున్నారు. కేసీఆర్ తో కలువకపోతేనే మంచిదని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఒంటరిగానే అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also read: కేసీఆర్ పై జ'గన్': ఇద్దరు సిఎంల మధ్య తెలంగాణలో పోలిక చిచ్చు  

ఈ నేపథ్యంలో ఒకసారి రెండు రోజుల కింద ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం. కెసిఆర్ అనే కత్తికి రెండువైపులా పదునే అని,అతనితో వ్యవహారం కత్తి మీద సాము అని అన్నాడు. ఎన్నికలప్పుడు ఆంధ్రోళ్ళను కొట్టి ఇది తెచ్చాను అని తెలంగాణ ప్రజలకు చూపిస్తే ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాడు అని అన్నాడు. 

ఈ అన్ని పరిస్థితులను క్రోఢీకరిస్తే ఒక విషయం అర్థమవుతుంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కెసిఆర్ ను మరింత ఇరకాటంలోకి నెట్టడం తథ్యం. కేసీఆర్ తన మీదకు అపవాదు రాకుండా ఉండేందుకు జగన్ ను ఎటాక్ చేస్తాడు. తెలంగాణాలో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కన్నా ముందుగానే 2023లోనే ఉన్నాయి. అప్పుడు తెలంగాణలోని ప్రతిపక్షాలు జగన్ ను చూపెట్టి కేసీఆర్ ను ఎద్దేవా చేస్తే కేసీఆర్ ఖచ్చితంగా జగన్ ను ఎటాక్ చేస్తారు. 

Also read: రెండు వైపులా పదును, కేసీఆర్ తో జాగ్రత్త: జగన్ కు ఉండవల్లి హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలప్పుడు చంద్రబాబు వీటినే జగన్ మీదకు విమానార్శనాస్త్రాలుగా ఎక్కుపెడతాడు. "కేసీఆర్ అన్ని మాటలన్నా ఎందుకు మాట్లాడ లేదు", "రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టావు" వంటి డైలాగ్స్ తో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్తాడు. 

ఇలా రాజకీయంగా తనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టే జగన్ కేసీఆర్ తోని ఒకింత జాగ్రత్తతో మసులుకోనున్నట్టు మనకు అర్థమవుతుంది. కృష్ణ గోదావరి అనుసంధానాన్ని తెలంగాణాతోని పొత్తు పెట్టుకోకుండా సొంతగా చేపడతామని చెప్పడం దీన్ని ధృవీకరిస్తుంది.