విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే తమ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం కుదరదని చెబుతూ కేసీఆర్ ఏపీలో విలీనం చేయాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయంపై కూడా స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయం ఏమవుతుందో ఆరు నెలల్లో చూద్దామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై పేర్ని నాని స్పందించారు. కేసీఆర్ ప్రకటనతో తమలో కసి పెరిగిందని ఆయన అన్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో రాష్ట్ర ఆర్టీసీ వైద్యశాలలో డార్మెటరీని బుధవారంనాడు మంత్రి ప్రారంభించారు. 

ఆ కార్యక్రమం సందర్భంగా ఆయన కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి, పట్టుదల పెరిగాయని ఆయన అన్నారు. వచ్చే మూడు నెలల్లో విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 

సంస్థలన్నీ ప్రైవేట్ పరం అవుతున్న పరిస్థితిలో ఏపీలో ఒక కార్పోరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేయడమనేది చాలా గొప్ప నిర్ణయమని, మొండి నిర్ణయమని పేర్ని నాని అన్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఏపీఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్ మాటను తాము సానుకూల వైఖరితోనే తీసుకుంటున్నామ ని ఆయన చెప్పారు మరో మూడు నెలల్లో విలీనం చేసి ఆరు నెలల్లో ఏమవుతుందో చూపించి కేసీఆర్ మాటలను నిజం చేస్తామని ఆయన అన్నారు.