అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య కొనసాగుతున్న స్నేహానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ తో దోస్తీకి వైఎస్ జగన్ కటీఫ్ చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై గత నిర్ణయానికి భిన్నంగా వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని ఉమ్మడిగా చేపట్టాలనే అంశంపై వైఎస్ జగన్ కు, కేసీఆర్ కు మధ్య మూడు సార్లు భేటీలు జరిగాయి. నదుల అనుసంధానాన్ని ఉమ్మడి చేపట్టాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏపి ప్రభుత్వం విడిగా నదుల అనుసంధానాన్ని చేపడితేనే మంచిదని జగన్ కు నిపుణులు సలహా ఇచ్చినట్లు సమాచారం. 

ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది కాబట్టి నష్టమేమీ ఉండకపోవచ్చునని, అయితే భవిష్యత్తులో అలాంటి వాతావరణం ఉంటుందని చెప్పలేమని, స్నేహ సంబంధాలు దెబ్బ తింటే చేసిన వ్యయానికీ పొందే ప్రయోజానానికి మధ్య పొంతన కుదరకపోవచ్చునని అంటున్నారు. కేసీఆర్ తో కలువకపోతేనే మంచిదని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఒంటరిగానే అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

నదుల అనుసంధానంపై ఏపీ ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. దాని అంచనా వ్యయం రూ.60 వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక సహాయ సంస్థల నుంచి అప్పుగానూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం రూపంలోనూ పొందాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది. 

ప్రణాళిక మేరకు నీటిని మళ్లించడానికి గుంటూరు జిల్లా బొల్లపల్లెలో ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి నీటిని మళ్లించడానికి కాలువలు, చానెల్స్ ఏర్పాటు చేసి కర్నూలు జిల్లా బనకచెర్ల వరకు నీటిని తీసుకుని వెళ్తారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు రాకుండా చూసుకోవడానికి ఒంటరిగానే ఈ ప్రాజెక్టును చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.