ప్రముఖ విశ్లేషకులు,మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ నుంచి మొదలుకొని జగన్ సర్కార్ పాలన ఎలా సాగుతుందనే అనేక అంశాలపై మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో కెసిఆర్,మోడీలు ఇద్దరూ ఒకటే అని,ఇద్దరి మధ్య పోలిక చెప్పారు. 

ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహ సంబంధాలుండడం మంచిదే అంటూ కేసీఆర్ తోని మాత్రం చాల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కెసిఆర్ అనే కత్తికి రెండువైపులా పదునే అని అన్నాడు. కేసీఆర్ అనేవాడితో జాగ్రత్తగా ఉండాలని జగన్ ను ఉండవల్లి హెచ్చరించారు. 

Also read#జలయజ్ఞానికే మొదటి ప్రాధాన్యత...: అధికారులకు జగన్‌ ఆదేశాలు

కేసీఆర్ సహజంగా మంచి వక్త అని ఎన్నికల వేళ ఎలాగైతే మోడీ జాతీయత, పాకిస్తాన్ వంటి అంశాలను ముందుకు తెచ్చి ప్రజలను తన వెంట నడిపించుకుంటాడో కేసీఆర్ కూడా ఆంధ్ర సెంటిమెంటును అలానే ఉపయోగించుకొని ఎన్నికల్లో గట్టెక్కుతాడని ఉండవల్లి అన్నారు. 

సెక్రటేరియట్ కు రారు కెసిఆర్, అందుబాటులో ఉండరు ఇలా ఎన్ని అంశాలు కేసీఆర్ వ్యతిరేకులు పదే పదే చెప్పినా ప్రయోజనం ఉండదని, కేసీఆర్ సచివాలయానికి రాకున్నా కూడా ఆంధ్ర వ్యతిరేక తెలంగాణ సెంటిమెంటును సకాలంలో పండించి సన్నివేశాన్ని రక్తగట్టిస్తాడని ఉండవల్లి అన్నాడు. 

ఎన్నికల వేళ ఆంధ్రోళ్ళను దెబ్బకొట్టి నేను ఇది సాధించాను అని తెలంగాణ ప్రజానీకం ముందుబెడితే సరిపోతుందని, ఎన్నికల్లో విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన బలంగా వాడే తెలంగాణ సెంటిమెంట్ ముందు అవేవి పని చేయవని ఉండవల్లి అన్నారు. కెసిఆర్ ఇలా ఆంధ్రను దెబ్బకొట్టి సాధించాను అని చెప్పుకునే ఆస్కారం ఉంది కాబట్టి, ఏవైనా ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఒకింత జాగురూకతతో వ్యవహరించాలని జగన్ కు హితవు పలికాడు. 

మోడీ కి కెసిఆర్ కు పోలిక చెబుతూ ఎన్నికల వేళ పీఓకే,సర్జికల్ స్ట్రయిక్స్, జాతీయత వంటి అంశాలను ఎలా తీసుకొస్తాడో కెసిఆర్ కూడా అలానే తెలంగాణ సెంటిమెంటును ముందుకు తీసుకొస్తారు అని అన్నాడు. అంతే కాకుండా హిందూస్తాన్ హిందువుల దేశం, ముస్లిం ద్వేషాలను ఎలా వాడుతాడో కెసిఆర్ కూడా ఆంధ్ర ద్వేషాన్ని సమర్థవంతంగా వాడతాడని ఉండవల్లి అన్నాడు. 

స్వాతంత్రం వచ్చిన తరువాత మన ప్రధాన మంత్రుల్లో జవహర్ లాల్ నెహ్రు ఎంతటి వక్తో,ఇప్పుడు నరేంద్ర మోడీ అంతటి వక్త అని అన్నారు. కాకపోతే నెహ్రు క్లాస్ అయితే మోడీ మాస్ అని అన్నారు. మోడీ కి తాను వ్యతిరేకిని కాదని, కేవలం మోడీ సిద్ధాంతాలను మాత్రమే వ్యతిరేకిస్తానని, మోడీ గొప్ప కమిట్మెంట్ ఉన్న నేత అని అన్నాడు.