Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పై జ'గన్': ఇద్దరు సిఎంల మధ్య తెలంగాణలో పోలిక చిచ్చు

కేసీఆర్ కు వైఎస్ జగన్ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఆర్టీసీ మొదలు వివిధ విషయాలపై జగన్ తో కేసీఆర్ ను పోల్చి చూపుతూ తెలంగాణలో చిచ్చు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

jagan administrative decisions: new headaches for kcr!
Author
Hyderabad, First Published Oct 23, 2019, 1:27 PM IST

తెలంగాణలో ప్రస్తుతానికి నడుస్తున్న హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా ఆర్టీసీ సమ్మే! నేటికీ 19వ రోజుకి చేరింది. మొన్నటితో హుజూర్ నగర్ ఉప ఎన్నిక హడావుడి కూడా ముగిసిపోయింది. ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు గవర్నర్ తమిళిసై ని కూడా కలుసుకున్నారు. ఆమె వారికి అధైర్యపడొద్దని చెబుతూ, ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. 

అసలు ఈ ఆర్టీసీ సమ్మె మొదలవడానికి వినాయక చవితి పండగప్పుడు జీతం ముందు వెయ్యమని కార్మికులు కోరడం దానికి ప్రభుత్వం స్పందించక పోవడం నుండి మొదలుకొని అనేక కారణాలున్నా, ట్రిగ్గర్ పాయింట్ మాత్రం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నానంటూ ప్రకటన చేయడం. 

ఈ ఒక్క చర్య వల్లే తలనొప్పి అధికమైందని కెసిఆర్ తల పట్టుకుంటుంటే, జగన్ తన పాలనలో తీసుకుంటున్న రాడికల్ నిర్ణయాల వల్ల కెసిఆర్ కు మరిన్ని నూతన చిక్కులు వచ్చిపడేలా కనిపిస్తున్నాయి. 

Video: వెనక్కితగ్గని ఉద్యోగులు, సెల్ఫ్ డిస్మిస్ అంటున్న ప్రభుత్వం: తెలంగాణలో సమ్మెయథాతథం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాననే ప్రకటన జగన్ నోట వెలువడగానే తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు వెంటనే ఆ డిమాండును ఎత్తుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా తమ సంస్థను రాష్ట్రప్రభుత్వంలో విలీనం చేయాలని సమ్మెబాట పట్టాయి. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఎందుకు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. 

సమ్మె అంతకంతకు ఉదృతమవుతున్న వేళ జగన్ తీసుకున్న మరో నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు మరో అస్త్రమయ్యింది. నూతన బస్సులను కొననున్నట్టు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించగానే ఇక్కడి ఆర్టీసీ కార్మికులు వారి నిరసనలను మరింత ఉదృతం చేసారు. ఒక పక్క జగన్ ఏమో నూతన బస్సులు కొని ఆర్టీసీని బలోపేతం చేయాలని చూస్తుంటే, మరొపక్కనేమో కెసిఆర్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు అద్దె బస్సులను తీసుకోవడం, ప్రైవేట్ బస్సులకు స్టేజి క్యారేజీలు ఇవ్వడం వంటి పనులకు పాల్పడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేసారు. 

ఆర్టీసీకి తోడు జగన్ మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. అవి రానున్న భవిష్యత్తులో కెసిఆర్ కు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టేవిలా కనపడుతున్నాయి. ఈ నూతన తలనొప్పుల్లో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న రైతు భరోసా గురించి. 

ఈ రైతు భరోసా కెసిఆర్ ఇచ్చే రైతు బంధు కన్నా ఎక్కువ. ఇక్కడ తలనొప్పి తెచ్చిపెట్టే అసలు విషయం ఇది కాదు. వేరేది ఉంది. జగన్ రైతుభరోసాను భూమి ఉన్న రైతులకే కాదు, భూమి లేని కౌలు రైతులకు కూడా వర్తింప చేయనున్నాడు. 

తెలంగాణాలో కెసిఆర్ సర్కారేమో అసలు కౌలు రైతులను గుర్తించేదే లేదంటూ పాస్ పుస్తకాల్లోంచి 'అనుభవదారుడు' అనే కాలమ్ ని తొలగిస్తే అవతల జగన్ ఏమో వారిని గుర్తించడమే కాకుండా పెట్టుబడి సహాయం కూడా అందిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ విషయం స్తబ్దుగా ఉన్నా ,ఎప్పుడో ఒకప్పుడు చిక్కులను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. 

కెసిఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టె మరో అంశం ఉద్యోగ నియామకాలు. లక్ష ఉద్యోగాలన్న కెసిఆర్ ఇంత వరకు దాన్ని నెరవేర్చలేకపోయాడు. జగన్ పదవిలోకి వచ్చిన 5 నెలల్లోనే దాదాపు రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాడు. వచ్చే జనవరి నుంచి పోటీ పరీక్షల క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. 

నీళ్లు,నిధులు,నియామకాలు అనే మూడు మౌలికమైన అంశాల ఆధారంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం కోసం యావత్తు తెలంగాణ ప్రజానీకం కదిలింది కూడా అందుకే. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులు కెసిఆర్ పై ఒకింత గుర్రుగానే ఉన్నారు. ఒక రకంగా ఆ వర్గం కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టైన ఉస్మానియా యూనివర్సిటీలోకి ఏ తెరాస నేత కూడా అడుగుపెట్టలేని పరిస్థితి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో ఒక గ్రూప్-1 నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటివరకు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పడి కూడా 5సంవత్సరాలయ్యింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క గ్రూప్-1 సర్వీస్ నియామకానికి కూడా ప్రకటన వెలువడలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం రెండు సార్లు ప్రకటన విడుదల చేసింది. 

పేద రాష్ట్రం,అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు గ్రూప్-1,గ్రూప్-2 నియామకాలకు నోటిఫికేషన్ వదిలితే, ధనిక రాష్ట్రం,మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తెలంగాణాలో ఇది సాధ్యం కాదా? ఏ ఉద్యోగి కూడా రిటైర్ అవ్వలేదా? ఒక గ్రూప్-2 ను మాత్రం విడుదల చేసిన సర్కార్ దాని ఫలితాన్ని ఇప్పటివరకు విడుదల చేయలేకపోయింది. 2015లో నోటిఫికేషన్ విడుదలైంది. పరిక్షేమో 2016లో జరిగింది. 2017 లో రాత పరీక్షా ఫలితాలను ఇచ్చారు. ఎగ్జామ్ అయ్యింది మొదలు కోర్ట్ బెంచ్ మీదికెక్కిన గ్రూప్-2 అక్కడి నుంచి 2019 అయినా దిగనంటుందో. దరిదాపుల్లో దిగే పరిస్థితులు కూడా కనపడడం లేదు. 

ఇన్ని రోజులంటే తెలంగాణాలో విద్యార్థుల సమస్యను ఎత్తుకొని పోరాటం చేసే వారు కరువయ్యారు. కానీ ఇప్పుడు బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా లేదు. విద్యార్థులకు గనుక బీజేపీ ఆలంబన దొరికితే మాత్రం వారు ఉద్యమించే ప్రమాదం కూడా ఉంది. ఈ ఉద్యోగ నియామకాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 

ఇక మరో అంశం పేదలకు ఇండ్లు. జగన్ సర్కార్ నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇండ్లు కట్టించాలని డిసైడ్ అయిపోయింది. అందుకోసం భూములను కూడా సేకరించడం ఆరంభించింది. గత చంద్రబాబు ప్రభుత్వం మాదిరి అపార్ట్ మెంట్లలా కాకుండా ఇండిపెండెంట్ ఇండ్లను కట్టించి ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. 

కెసిఆర్ సర్ ఏమో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తానన్న హామీతో 2014 ఎన్నికలకెళ్ళాడు. ఎక్కడో హైదరాబాద్ లో మరికొన్ని చోట్ల మినహాయిస్తే అవి పూర్తయిన దాఖలాలు లేవు. మేకలను గొడ్లను పెట్టుకోవడానికి అనువుగా ఇండ్లను నిర్మించి ఇస్తానన్న కెసిఆర్ గారు బహుళ అంతస్థుల భావంతులు నిర్మించారు. ఈ జీవాలను ఏసుకొని రోజు ప్రజలు మెట్లెక్కలేమో!

జగన్ వచ్చే ఉగాది నాటికి పట్టాలిస్తాను అన్నాడు. ఈ ఇండ్ల నిర్మాణం కూడా పూర్తయ్యి ప్రజలకు పంపిణీ మొదలుపెడితే తెలంగాణలోని ప్రతిపక్షాలు ఈ విషయమై గొంతెత్తడం మాత్రం ఖాయం. ఇప్పటికే ఆ విషయమై మాట్లాడుతున్నా,అప్పుడు ప్రజలు జగన్ పంపిణీ చేస్తున్న విషయాన్నీ టీవీల్లో చూస్తుంటారు కాబట్టి చాలా తేలికగా ప్రతిపక్షాల వాదనకు కనెక్ట్ అవుతారు. 

ఇంకొన్ని రోజుల్లో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగనుంది. మరోమారు అధికార పార్టీ ప్రజలను ఓట్లడిగేందుకు ప్రజలముందుకెళ్లనుంది. బీజేపీ ప్రాబల్యం పట్టణ ప్రాంతాల్లో ఒకింత మనకు కనపడుతుంది. దానికితోడు వారు 4పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి ఉన్నారు. వారి ప్రాబల్యాన్ని పెంచుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో వారు కెసిఆర్ ను ఇరుకున పెట్టే ఏ అంశాన్ని కూడా వదిలరు. ఇప్పటికే నడుస్తున్న ఆర్టీసీ ఉద్యమం, గవర్నర్ యాక్టివ్ గా వ్యవహరించడం వంటి తలనొప్పులు  సరిపోవన్నట్టు రానున్న కాలంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు కెసిఆర్ కు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టేవిలా కనపడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios