శివసేన జన్మరహస్యం: నేటి పొత్తు పొడుపునకు కారణమదే...
సిద్ధాంత పరంగా కూడా ఉన్న వైరుధ్యాలను పక్కనపెడుతూ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కలవబోతున్నాయి. వాస్తవానికి ఈ పొత్తు ఇప్పుడేదో వింతగా అనిపించినా, వీరి మధ్య ఉన్న ఈ నాటి బంధం 60 ఏళ్ల నాటిదని తెలుసా?
అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. విభిన్న సిద్ధాంత భావజాలాలతో కూడిన పార్టీలు కలిసి రావడం మహారాష్ట్ర రాజకీయ వర్గాలతోపాటు, దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, శివసేన పొత్తుకు సంబంధించిన కామన్ మినిమం ప్రోగ్రాం గురించి మాట్లాడడం వింతగా అనిపించినప్పటికీ, వారి సంబంధం మాత్రం ఇప్పటిది కాదు.
కాంగ్రెస్-సేనల సంబంధం దాదాపు ఐదు దశాబ్దాల స్నేహం. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రతికూలతలను ఎదుర్కోవడంలో ఒకరికొకరు అనేకసార్లు సహాయపడుతూ ఇరు పార్టీలు ఎదిగాయి.
Also read: ఎన్సీపీ, సేన, కాంగ్రెస్‌ల మధ్య అధికార పంపకాలు ఇలా
శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే 1985 లో బిజెపి రూపంలో కొత్త ఫ్రెండ్ ను వెతుక్కునే వరకు, ఆయన పార్టీ శివసేన కాంగ్రెస్ కు రాజకీయ నీడగా, బీ టీం గా వ్యవహరించడం బహిరంగ రహస్యమే. ముంబైలో, తరువాత మహారాష్ట్ర అంతటా శివసేన ఎదుగుదల కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలతో నేరుగా సంబంధం ఉంది.
శివసేన పార్టీ స్థాపన... అందులోని మర్మం
ఈ రెండు పార్టీల మధ్య సంబంధం 1960ల నాటిది. పారిశ్రామికీకరణ అప్పుడప్పుడే బొంబాయి నగరంలో విస్తృతంగా వ్యాప్తమవుతున్న వేళ. అనేక మిల్లులకు బొంబాయి ఆ కాలంలో నిలయంగా మారింది. సెంట్రల్ బొంబాయిలోని పరేల్ నుండి దక్షిణ ముంబైలోని గిర్గామ్ వరకు పూర్తిగా వస్త్ర మిల్లులతో నిండిపోయి ఉండేది.
ఈ మిల్లుల్లో కార్మికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, వారి సమస్యలు కూడా పెరిగాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) అప్పుడప్పుడే కార్మిక సంఘాలను బొంబాయిలోకి తీసుకువస్తున్న సమయం.
పెరుగుతున్న సమస్యలతో, వాటి పరిష్కారం కోసం కార్మికులు, కార్మిక సంఘాలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు పెరిగేకొద్దీ కమ్యూనిజం కూడా విస్తృతంగా పెరిగింది.
Also read: రాష్ట్రపతి పాలన: శరద్ పవార్ "మహా" గేమ్ ప్లాన్ ఇదీ..
1960 లలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు, కార్మిక సంఘాలు, వాటి కార్యకలాపాలు తలనొప్పులు తెచ్చి పెట్టడం ప్రారంభించాయి. వాటిని నిరోధించడం కాంగ్రెస్ కు తలకు మించిన భారంగా మారింది.
ఇదే సమయంలో, శివసేన మరాఠీ మానుస్ (భూమి పుత్రులు) అని పిలుపునిస్తూ వారి కోసం పనిచేయడం ఆరంభించింది. మిల్లు కార్మికులు మరాఠీలు అవడం వల్ల, వారిలో చాలామంది సేన వైపు ఆకర్షితులయ్యారు. అప్పటికి అది కేవలం ఒక సంస్థ మాత్రమే.
1966 లో రాజకీయ పార్టీగా శివసేన అవతరించడంలో కాంగ్రెస్ పూర్తి సహాయ సహకారాలు అందించింది.
శివసేనకు ఒక పార్టీ నిర్మాణాన్ని ఇవ్వమని బాల్ ఠాక్రే తండ్రి ప్రభోదాంకర్ ఠాక్రే, బాల్ ఠాక్రేకు సూచించినప్పుడు, ఎందరో కాంగ్రెస్ పెద్దలు తమ సహాయ సహకారాలను అందించారు. పార్టీ వ్యవస్థాపకుల్లో చాలా మంది కాంగ్రెస్ నాయకులున్నారు. మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రామ్‌రావ్ ఆదిక్ కూడా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
Also read: కాంగ్రెస్ తో శివసేన: ఈ నాటి ఈ 'మహా' బంధమేనాటిదో...
ఆ విధంగా బొంబాయిలో రాజకీయ పార్టీగా శివసేన ప్రయాణం ప్రారంభమైంది.
శివసేన పుట్టుక, ట్రేడ్ యూనియన్ ఉద్యమం వేళ్లూనుకోవడం రెండూ ఒకే సమయంలో జరిగాయి. ట్రేడ్ యూనియన్ల ద్వారా కమ్యూనిజం టెక్స్‌టైల్ మిల్లుల్లోకి దిగుమతి అయ్యింది.
శివసేన మరాఠీ భాషకు ప్రాముఖ్యాన్ని ఇవ్వడం, వారికోసం పనిచేస్తుండడంతో, మరాఠీ భాషను మాట్లాడే మిల్లు కార్మికుల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలను ప్రారంభించింది.
శివ సైనికులు, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. పెరుగుతున్న ఘర్షణలను అరికట్టకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండిపోయింది. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో శివసేన తన పట్టును పెంచుకోవడంలో ఇతోధికంగా సహాయపడింది కాంగ్రెస్ పార్టీ.
1967 లో, పరేల్‌లోని దాల్వి బిల్డింగ్ లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సేన కార్యకర్తలు తగలబెట్టారు. సిపిఐ నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు కృష్ణ దేశాయ్ హత్యతో ఇరు పార్టీల మధ్య వైరం తారాస్థాయికి చేరింది.
ఎమర్జెన్సీ కి ఠాక్రే మద్దతు...
పెరుగుతున్న ఠాక్రే ఇమేజ్, ఎందరో యువకులను ఆకర్షించింది. సిపిఐ పార్టీలోని ఎందరో సీనియర్ల పిల్లలు సైతం శివసేనవైపు ఆకర్షితులయ్యారు. ఈ తతంగం నడుస్తున్నంతసేపు, కాంగ్రెస్ తన భాగస్వామి శివసేన పక్షాన గట్టిగా నిలబడింది.
1975 లో, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు, ఠాక్రే బహిరంగంగానే మద్దతు పలికారు.
అదే సంవత్సరం బాంబే మేయర్ ఎన్నికలలో ఠాక్రే కాంగ్రెస్ నాయకుడు మురళి దేవరాకు మద్దతు పలికి ఆయన గెలుపుకు కృషి చేసారు.
1978 లో, కాంగ్రెస్ శివసేన అభ్యర్థి వామన్‌రావ్ మహాదిక్ కు మద్దతు తెలిపింది. బొంబాయి మేయర్‌గా ఎన్నికయ్యేందుకు అతనికి పూర్తి స్థాయిలో సహాయపడింది.
Also read: మహా మలుపు: కిస్సా కుర్సీ కా నై, బీజేపీతో శివసేన వైరం వెనక ఇదే...
1980లో శివసేన, మహారాష్ట్ర శాసనసభలోకి ప్రవేశించగలిగే స్థాయికి ఎదిగినప్పటికీ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఠాక్రే నిర్ణయించుకున్నారు. బదులుగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం అనేక ర్యాలీలలో ప్రసంగించారు. ముంబై లోని నెహ్రూనగర్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి బాబాసాహెబ్ భోంస్లే సభలో కూడా ప్రసంగించారు . అలా ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
కాంగ్రెస్ అభద్రతా భావం...
శివసేన ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ, కాంగ్రెస్ కలవర చెందడం మొదలుపెట్టింది. నెమ్మదిగా, ఇరు పార్టీలమధ్య ఉన్న స్నేహం వైరంగా మారడం మొదలుపెట్టింది. కాంగ్రెస్, శివసేన నాయకుల మధ్య వ్యక్తిగత స్నేహం కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ సంబంధాలు మాత్రం దిగజారాయి.
ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేయడం కోసం ఇరు పార్టీలు పోటీ పడ్డారు. వారి మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పెద్ద సంఖ్యలో బొంబాయికి వలస వచ్చిన దక్షిణ భారతీయులకు వ్యతిరేకంగా శివసేన హింసాత్మక వైఖరి కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. శివసేన హిందుత్వ అజెండాను ఎత్తుకోవడం, బిజెపితో కొత్తగా ఏర్పడిన మైత్రి, అన్నీ వెరసి కాంగ్రెస్ తోని సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఇలా సంబంధాలు తెగిపోయినప్పటికీ, ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ, శివసేన ప్రతిభా పాటిల్, తరువాత ప్రణబ్ ముఖర్జీల రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
సిద్ధాంతాలకతీతంగా ఇరు పార్టీల మధ్య ఇప్పుడు పొడుస్తున్న పొత్తు అధికారం కోసం కాబట్టి ఇది వర్క్ అవుట్ అయ్యే విధంగానే కనపడుతుంది.