మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఊహాతీత పరిణామాల పరంపరగా కొనసాగుతుంది. శివసేన, బీజేపీల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం మొదలైన గిల్లికజ్జాలు ఇరు పార్టీల మధ్య విడాకులకు దారితీసింది. 

తొలుత శివసేన ఎంత మంకుపట్టు పట్టినా, చివరకు బీజేపీతొ కలవడం మాత్రం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇరు పార్టీల సిద్ధాంతాలు కూడా ఒకేలా ఉండడం, భావసారూప్యత ఉండడం, ఎన్నో సంవత్సరాలుగా ఇరు పార్టీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల అందరూ అలా ఊహించారు. 

మరి బీజేపీ అయినా శివసేన డిమాండ్ కు తలొగ్గొచ్చు కదా అంటే, ప్రస్తుత బీజేపీ అధినాయకత్వం అందుకు ఎంత మాత్రమూ సిద్ధంగా లేదు. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ఒప్పుకోదు. 

ఒక వేళ బీజేపీ గనుక ముఖ్యమంత్రి అభ్యర్థిని మారిస్తే శివసేన అది తమ విజయంగా భావిస్తుంది. కుర్చీలో కూర్చోబోయే వ్యక్తికి శివసేన ఒక రకంగా చుక్కలు చూపెడుతుంది. ఆ వ్యక్తి పరిస్థితి దిన దిన గండం నూరేళ్లాయుష్షు అన్నట్టుగా తయారవుతుంది. 

Also read: మహా మలుపు: పవార్ షరతు తలొగ్గిన శివసేన, కేంద్ర మంత్రి రాజీనామా

కానీ శివసేన మాత్రం ఇది తనకు వచ్చిన ఆఖరి అవకాశంలాగా, ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేమన్నట్టుగా బీజేపీ కి కటీఫ్ చెప్పి మరీ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు. శివసేన ఇంతలా పట్టుబట్టడానికి కూడా కారణం లేకపోలేదు. 

ఎన్నికల రిజల్ట్స్ గనుక తీసుకుంటే, బీజేపీ 105 సీట్లు సాధించగా భాగస్వామ్య శివసేన వారిలో సగం సీట్లను మాత్రమే సాధించింది. వారు కేవలం 55 స్థానాల్లోనే విజయం సాధించారు. కేవలం 50 శాతం సీట్లనే సాధించిన పార్టీ అధికారంలో మాత్రం 50 శాతం వాటా అడగడం సాధారణ ప్రజానీకానికి విడ్డూరంగానే కనపడ్డప్పటికీ, వారు అలా పట్టుబట్టడానికి బలమైన కారణమే ఉంది. 

Also read: మహా మలుపు: ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో శివసేన..కీలక నేతలతో ఉద్ధవ్ భేటీ...

శివసేన ప్రస్తుత మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవాలంటే,మహారాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని, దానితోపాటు మోడీ-శాల నేతృత్వంలోని జాతీయ రాజకీయ చిత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవలిసి ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయాలను గనుక చూసుకుంటే, బీజేపీ అనే పార్టీ  90వ దశకంలో అక్కడ అంత బలీయమైన శక్తి కాదు. అప్పట్లో శివసేన బీజేపీ కన్నా చాలా బలమైన పార్టీ, కార్యకర్తలపరంగా అయినా, ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ పరంగా అయినా శివసేన నీడలోనే బీజేపీ కొనసాగేది. 

అక్కడ 1990 నుంచి బీజేపీకి శివసేనకు వచ్చిన ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను చూస్తే అది మనకు అర్థమవుతుంది. 2014లో మోడీ కేంద్రంలో గెలిచిన మేనియా వల్ల 2014లో అమాంతం బీజేపీ గ్రాఫ్ రెట్టింపయ్యింది. మహారాష్ట్రలో కీలకం కానీ ఒక పార్టీ ఏకంగా 122 సీట్లు తెచ్చుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 

Also read: మహా రాజకీయం: శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ సై!

మరోపక్క శివసేన పరిస్థితిని చూసుకుంటే, వారి ఓట్ల శాతాన్ని గనుక పరిశీలిస్తే 16 నుంచి 17 శాతం ఓట్లను ఆవేరేజ్ గా సాధిస్తున్నారు. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత బలీయంగా ఉన్నప్పుడు వారు సాధించే ఓట్ల శాతం పెరుగుతుంది. కొన్ని సంవత్సరాల్లో దాదాపుగా 20 శాతం మేర కూడా శివసేన ఓట్లు సాధించినప్పడికీ, ప్రస్తుత పరిస్థితుల్లో వారి ఓట్ల శాతం మళ్ళీ తిరిగి అదే 16 శాతానికి పడిపోయింది. 

ఇక్కడున్న లెక్కలను చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. 

బీజేపీ ఓట్ల శాతం ఇంతలా పెరగడానికి, వారు ప్రతిపక్ష ఓటును తమవైపు తిప్పుకోవడం కాదు, స్వపక్ష గూటిలోని శివసేన ఓట్లను చీల్చిడం ద్వారా వారు లాభపడుతున్నారు. 30 సంవత్సరాల ఈ అనుబంధానికి వారు వదులుకోవడానికి ఇదే ప్రముఖమైన కారణంగా మనకు కనపడుతుంది. 

1989లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీతోలిసారి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. వారికి ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అవసరం. ఈ నేపథ్యంలో హిందుత్వ సిద్ధాంతాల పరంగా దగ్గరైన ఇరు రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ భాగస్వామ్యానికి తెరదించబోతున్నాయి.

శివ సేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే అప్పట్లో ఒక ఫార్ములాను ప్రవేశ పెట్టారు. ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తే వారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని అన్నారు. అన్నట్టుగానే 1995లో శివసేనకు అత్యధిక సీట్లు రావడంతో అదే పార్టీకి చెందిన మనోహర్ జోషి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ తరువాత నుంచి ఠాక్రే ఫార్ములా వల్ల ఎక్కువ సీట్లలో పోటీ చేయడానికి ప్రతి ఎన్నికలప్పుడు కూడా సీట్ల పంపకాల్లో గిల్లికజ్జాలు మొదలయ్యాయి. అవి అలా కొనసాగినప్పటికీ వారి బంధం మాత్రం అలానే కొనసాగింది. 

బీజేపీ ఇలా విపరీతంగా తమ ఓట్లను చీలుస్తూ లాభపడుతుండడంతో బాలాసాహెబ్ ఠాక్రే అప్పట్లో ఒక సంచలన వ్యాఖ్య చేసారు. కమలం వికసించడానికి కారణం శివసేన అనే విషయాన్నీ మరవకండి అని అన్నారు. శివ సేన ఓట్ల వల్ల బీజేపీ మహారాష్ట్రలో లాభపడుతుందన్న విషయం వారికి కూడా అర్థమయ్యిందనేది సుస్పష్టం. 

Also read: బీజేపీతోనే తేల్చుకోండి.. మేము ప్రతిపక్షంగానే ఉంటాం: శివసేనకు పవార్ సూచన

ఇది మహారాష్ట్ర రాజకీయ పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారి జాతీయ రాజకీయాల విషయానికి వద్దాము. మోడీ అమిత్ షాల నాయకత్వం లోని బీజేపీ సొంతగా 300 సీట్లోచినంత మాత్రాన ఆగదు. మిత్రపక్షాల తోని కలుపుకొని 350 పైచిలుకు సీట్లున్నా, సొంతగానే ఆ 350 మార్కును చేరుకునేదాకా వారు ఊరుకోరు. 

ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 50 శాతం ఓటు సాధించలేదు. 2014లో బీజేపీ 282 సీట్లు సాధించినా, వారికి వచ్చిన ఓట్ల శాతం మాత్రం 31.3 శాతం. 2019లో వారు సొంతగా 303 సాధించినా వారి ఓట్ల శాతం మాత్రం 37.36 శాతం. 

వారిప్పుడు 350 సీట్లు సాధించాలంటే వారి ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకోవాలి. విపక్ష ఓటు ఒక రకంగా ఫ్రీజ్ అయిపోయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీని గనుక తీసుకుంటే గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కూడా వారి 20 శాతం ఓట్లను వారు నిలబెట్టుకోగలిగారు. కాబట్టి బీజేపీకి ఓట్లు పెరగాలంటే అది ఖచ్చితంగా మిత్రపక్షాల ఓట్లు తినడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అదే పనిని బీజేపీ చేస్తుంది కూడా. 

ఇలా మిత్రపక్షాల్లో భావసారూప్యత వల్ల, సిద్ధాంత పరంగా శివసేన ఓట్లను కొల్లగొట్టడం బీజేపీకి చాలా తేలిక. గత చరిత్ర కూడా అదే చెబుతుంది. ఇప్పుడు ఇలా శివసేన ఎదుర్కుంటున్న ప్రమాదాన్ని ఒరిస్సా లో నవీన్ పట్నాయక్, తెలంగాణాలో కెసిఆర్ కూడా ఎదుర్కుంటున్నారు. 

శివసేన ఇదే తమ చివరి అవకాశంగా ఇప్పుడు కాకపోతే మరోసారి తమకు ఇలాంటి ఛాన్స్ దక్కదన్న కృత నిశ్చయంతో ఉంది. ఇప్పుడిది ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న తగువు అనే కన్నా, శివసేన పార్టీ భవిష్యత్తు కోసం వారు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. 

ఇప్పుడు గనుక వారు మరోసారి జూనియర్ పార్టనర్ గా కొనసాగితే మహారాష్ట్రలో బీజేపీ మరింతగా బలపడడంతోపాటుగా శివసేన పార్టీ ఓటర్ బేస్ బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందని వారు గాభరా పడుతున్నట్టు మనకు అనిపిస్తుంది.