ఒక వారం రోజులకింద బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతని చిరకాల ఇన్నింగ్స్ 2008లో సౌత్ ఆఫ్రికా తోని చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడిన వీడియోని జత చేసింది. ఆ మ్యాచులో సెహ్వాగ్ సాధించిన 319 ఇప్పటికి టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక స్కోర్. 

కొన్ని గంటల తరువాత అదే రోజు ఝార్ఖండ్ లో మరో మ్యాచ్ జరుగుతుంది. టెస్టుల్లో ఓపెనర్ గా ప్రమోషన్ దక్కించుకున్న రోహిత్ శర్మ తన లైఫ్ లోనే బెస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అది కూడా సిక్సర్ బాధి ఆ ఘనత అందుకున్నాడు. ప్రత్యర్థి కూడా వారే! ఎం మారలేదు. రోహిత్ శర్మ తన కెరీర్ బెస్ట్ టెస్ట్ స్కోర్ సాధించాడు. కాకపోతే సెహ్వాగ్ మాదిరి భారీ అభిమానుల సమూహం ముందు కాకుండా కేవలం కొందరు అభిమానులు మాత్రమే గ్రౌండ్ లో ఉన్నారు. 

Also read#బంగ్లాదేశ్ తో టీ20.. కెప్టెన్ గా రోహిత్... విరాట్ కి విశ్రాంతి

గత సౌత్ ఆఫ్రికా సిరీస్ లోని మూడు మ్యాచులు వైజాగ్,పూణే,రాంచి అన్నింటికీ అభిమానులు చాల కొద్దీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత కెప్టెన్ కోహ్లీ ఒక ఆసక్తికర ప్రకటన చేసాడు. భారత దేశంలో ఇన్ని టెస్టు వేదికలకు బదులు కేవలం ఒక ఐదింటిని గుర్తిస్తే సరిపోతుంది కదా అని అన్నాడు. 

అభిమానులు లేక వెలవెల బోతున్న స్టేడియంలను చూసిన ఏ క్రికెట్ అభిమాని అయినా ఈ విషయం గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఈ విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఎన్ని స్టేడియాలు ఉన్నాయి? మనం ఎం చేయవచ్చు వంటి మిగిలిన అంశాలపైన ఒక లుక్కేద్దాం. 

మొదటగా భారత దేశంలో అంతర్జాతీయ వేదికలు ఎక్కువవుతున్నాయి అంటే, భారత దేశంలో క్రికెట్ ప్రమాణాలు పెరుగుతున్నాయని లెక్క. కాకపోతే ఈ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లో ఇలా వేదికలు ఎక్కువవ్వడంవల్ల వచ్చే పరిణామాలను మనము చూసాము. 

ముంబై లోని వాంఖడే స్టేడియంలో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ 2016లో జరిగింది. ఇది 2019 మూడు సంవత్సరాల నుంచి ఒక్క మ్యాచ్ కూడా అక్కడ నిర్వహించకపోవడం ఆశ్చర్యకరం. విదేశాల్లో అయితే ఖచ్చితంగా ప్రతి ప్రధాన వేదికలో సంవత్సరానికి ఒక్క టెస్ట్ మ్యాచ్ అన్నా నిర్వహిస్తారు. కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదు అని మనకు వాంఖడే ఉదాహరణ నిరూపిస్తుంది. ఇంగ్లాండ్ లో ఇలా టెస్టు వేదికలను ప్రత్యేకంగా గుర్తించారు కూడా. వీటివల్ల గ్రౌండ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది కూడా. గ్రౌండ్ తోని టెస్ట్ మ్యాచ్ కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. 

Also read#బిసిసిఐలో "దాదా" గిరి: గంగూలీతో వైరం, రవిశాస్త్రికి చిక్కులే

మరో విషయం ఏమిటంటే షెడ్యూలింగ్. అంతర్జాతీయంగా గనుక మనం తీసుకుంటే ఫలానా పండగప్పుడు ఫలానా టెస్ట్ జరుగుతుంది అని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఉదాహరణకు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ లో జరుగుతుంది అని ఎప్పటి నుంచో వస్తుంది. ఇలానే మన దేశంలో కూడా పెడితే అభిమానులు దానికోసం వెయిట్ చేస్తారు, దాన్ని చూడాలనుకునేవారు ప్లాన్ చేసుకుంటారు. మన దేశంలో కరెక్ట్ గా తేదీలను ప్రకటించకున్నప్పటికీ, కనీసం ఈ పండగప్పుడు ఇక్కడ ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని చెబితే బాగుంటుంది. ఉదాహరణకు పొంగల్ టెస్ట్ మ్యాచ్ చెన్నై, దుర్గ పూజ కోల్కతా, బతుకమ్మ హైదరాబాద్ ఇలా పెడితే టెస్టు క్రికెట్ అభివృద్ధికి  ఎంతో దోహదకారిగా ఉంటుంది. 

ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఇలా కేవలం కొన్ని వేదికలను మాత్రమే గుర్తించడం వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. ఇంతకుముందంటే ప్లేయర్లు కేవలం బొంబాయి,ఢిల్లీ,చెన్నై వంటి మహా నగరాల నుంచి మాత్రమే వచ్చేవారు కాబట్టి ఇలా పెడితే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఆలా కాదు. మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ నుండి వచ్చాడు. ఇలా ఇప్పుడు ప్లేయర్స్ దేశ నలుమూలల నుండి వస్తున్నారు. 

అంతే కాకుండా పూణే టెస్టు పైన చాలా రకాల విమర్శలు వచ్చాయి. పూణే గ్రౌండ్ ను చేరుకోవడం చాల కష్టంగా ఉంటుంది. అది సిటీ నుంచి చాల దూరంగా ఉండడంతోనిపాటు అక్కడకు చేరుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకు గురవ్వాల్సి ఉంటుంది. ఇలా (ఆక్సిసిబిలిటీ) సులభతరమైన రవాణా మార్గాలను ఏర్పాటు చేయనంత కాలం ఈ తిప్పలు తప్పవు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రారు.

Also read#ధోనీ ఖేల్ ఖతమ్: ఎమెస్కే ప్రసాద్ మాటల ఆంతర్యం ఇదీ..

ఇదే పూణే గ్రౌండ్ కు అభిమానులు వన్డేలకు టీ20లకు తరలి వస్తారు. దానికి కారణం బీసీసీఐ కల్పించిన ప్రచారం. ప్రచారం వల్ల రవాణా ఆ రోజు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంటుంది. ఈ పబ్లిసిటీ కారణం వల్లనే ఆ రోజు గ్రౌండ్ నిండుతుంది. గ్రౌండ్ కు అభిమానులను తీసుకురావాలంటే ప్రచారం కూడా భారీ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది. 

సులభంగా గనుక గ్రౌండ్ కు చేరే వీలుగనుక ఉంటె మ్యాచ్ ఏ నగరంలో జరుగుతుందనే విషయానికి సంబంధం లేకుండా, గ్రౌండ్ నిండుతుంది. ఉదాహరణకు ఇండోర్ తీసుకుంటే, స్టేడియం నగరం నడిబొడ్డున ఉండడం వల్ల అభిమానులతో కిక్కిరిసి పోతుంది. సులభంగా గనుక గ్రౌండ్ కు చేరుకోగలిగితే స్టేడియం ఫుల్ గా ఉంటుందని మనకు ఇండోర్ ఉదాహరణ నిరూపిస్తుంది. 

మరొక అంశం ఏంటంటే, గ్రౌండ్ లో స్టాఫ్ వ్యవహరించే తీరు. ఢిల్లీలోని స్టేడియంలో కూర్చున్నాక బయటకు వెళ్లి రావడం కుదరదు. అదే బెంగళూరులో అయితే స్టాఫ్ చాలా స్నేహంగా ఉంటారు. కావాలంటే బయటకు వెళ్లి రావచ్చు కూడా. అంతే కాకుండా లోపలి ఎం పట్టుకుపోవొచ్చో,పట్టుకుపోకూడదో కూడా ఈ రెండు గ్రౌండ్లకు చాలా వ్యత్యాసం ఉంది. బెంగళూరులో ఉన్నంత స్వేచ్ఛ మనకు ఇక్కడ ఢిల్లీ స్టేడియంలో కనపడదు. 

also read#టెస్ట్ క్రికెట్ కి వరల్డ్ కప్:పూర్వ వైభవం వచ్చేనా?

క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టెస్ట్ క్రికెట్ ని క్లాసిక్ గా పేర్కొంటారు క్రికెట్ అభిమానులు. కానీ కాలం  గడుస్తున్నకొద్దీ, పొట్టి ఫార్మాట్లు ఎక్కువవ్వడంతోని టెస్ట్ క్రికెట్ కి ఆదరణ కరువయ్యింది. చాలా సార్లు టెస్ట్ క్రికెట్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచెస్ వంటివి నిర్వహించినప్పటికీ అవి అంత ఆదరణకు నోచుకోలేదు. తాజాగా బీసీసీఐ కూడా డే నైట్ టెస్ట్ మ్యాచ్ ల నిర్వహణకు ఆసక్తి కనబరుస్తుంది. ఎలాగైనా టెస్ట్ క్రికెట్ కి గత ప్రఖ్యాతి తీసుకురావాలని సంకల్పించి ఐ సి సి టెస్ట్ క్రికెట్ కి కూడా ప్రపంచ కప్ నిర్వహించడం ఆరంభించింది. 

ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ ని ఎలాగైనా అభిమానులకు మరింత చేరువ చేసి టెస్టులపై ఆసక్తి కలిగిస్తూ, ఉన్న లోపాలను పరిష్కరిస్తూ ముందుకు పోయినప్పుడు మాత్రమే  టెస్టు క్రికెట్ కు గత వైభవం వస్తుంది.