టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా కాలం తర్వాత విశ్రాంతి దొరికింది. త్వరలో బంగ్లాదేశ్ తో జరగనున్న టీ20 సిరీస్ కి విరాట్ కోహ్లీని దూరం పెట్టారు. గత కొంతకాలంగా విరామం లేకుండా మ్యాచులు ఆడుతున్నందుకు ఆయనకు విశ్రాంతి ఇచ్చారు. కాబట్టి బంగ్లాదేశ్ తో జరగనున్న సిరీస్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

గత కొద్దిరోజులుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె చేస్తుండగా... ఆ దేశ క్రికెట్ బోర్డు దిగివచ్చింది. దీంతో... వారు తమ సమ్మెను ముగించేశారు. ఈ క్రమంలో భారత్ పర్యటనకు బంగ్లా క్రికెటర్లకు లైన్ క్లియర్ అయ్యింది. 

దీంతో ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్‌ కమిటీ బంగ్లాతో ఆడే భారత టీ20, టెస్టు జట్లను గురువారం ప్రకటించింది. నవంబరు 3న న్యూఢిల్లీలో తొలి టీ20, 7న రాజ్‌కోట్‌లో, 10న నాగ్‌పూర్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి పొట్టి ఫార్మాట్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. 

టెస్టు జట్టులో పెద్దగా మార్పులు లేకపోయినా.. టీ20లో తొలిసారిగా ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు బెర్త్‌ దక్కింది. భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున అతడు అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అలాగే కేరళ యంగ్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ కల నాలుగేళ్ల తర్వాత నెరవేరింది. 2015లో జింబాబ్వేపై అతడు ఏకైక టీ20 మ్యాచ్‌ ఆడాడు. 

ఆ తర్వాత ఐపీఎల్‌లో, దేశవాళీల్లో చక్కటి ఆటతీరును కనబరుస్తున్నా జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. భారత్‌ ‘ఎ’ జట్టులో నిలకడగా రాణించే శాంసన్‌ ఇటీవలి విజయ్‌ హజారే ట్రోఫీలో ఏకంగా డబుల్‌ సెంచరీతో మెరవడంతో పాటు ఓవరాల్‌గా ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 125 స్ట్రయిక్‌ రేట్‌తో 410 పరుగులు సాధించాడు. దీంతో అతడికో అవకాశం కల్పించాలని సెలెక్షన్‌ కమిటీ భావించింది. 

ఇక వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పేరు చర్చకు రాలేదు. అతడి స్థానంలో 26 ఏళ్ల శివమ్‌ దూబేకు చోటిచ్చారు. దీంతో విజయ్‌ శంకర్‌ స్థానం గల్లంతైంది. 

‘గతంలో హార్దిక్‌ ఉన్నప్పుడు రెండో ఆల్‌రౌండర్‌గా విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశాం. అయితే ఇప్పుడు ఆ స్థానంలో శివమ్‌ దూబే సరైన ఆటగాడని భావించాం. దూకుడుగా ఆడే దూబే భారత్‌ ‘ఎ’ తరఫున విండీస్‌ టూర్‌లో, దక్షిణాఫ్రికాపైనా సత్తా చాటాడు’ అని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే తెలిపాడు. ఇక ఆల్‌రౌండర్‌ జడేజాకు విశ్రాంతినివ్వగా స్పిన్నర్‌ చాహల్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో పేసర్‌ సైనీ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.టెస్టు మ్యాచ్  సమయానికి మళ్లీ కోహ్లీ జట్టుతో కలవనున్నాడు. 

టీ20 జట్టు
రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, సంజూ శాంసన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, క్రునాల్‌ పాండ్యా, చాహల్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌.
 
టెస్టు జట్టు
కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, మయాంక్‌, పుజార, రహానె, విహారి, సాహా, జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌.