ధోనీ ఖేల్ ఖతమ్: ఎమెస్కే ప్రసాద్ మాటల ఆంతర్యం ఇదీ..

బిసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమెస్కే ప్రసాద్ మాటలను బట్టి ఎంఎస్ ధోనీ తిరిగి టీమిండియా జట్టులోకి రావడం అసాధ్యమేనని అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సమక్షంలో ఎమెస్కే ధోనీపై తన అభిప్రాయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి చెప్పారు.

We're moving on from MS Dhoni and backing Rishabh Pant: MSK Prsad

ముంబై: తాజా పరిణామాలను పరిశీలిస్తే మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనీ ఆట ముగిసినట్లే కనిపిస్తోంది. టీమిండియా డ్రెస్సింగ్ రూం తలుపులు ధోనీకి తెరుచుకోవడం కష్టంగానే ఉంది. గురువారంనాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సమావేశమయ్యారు. 

కోహ్లీ, రోహిత్ శర్మల సమక్షంలోనే ఎమెస్కే ప్రసాద్ నేతృత్వంలోని నేషనల్ సెలెక్షన్ కమిటీ సభ్యులు ధోనీ భవితవ్యం గురించి మాట్లాడారు. ధోనీని దాటి తాము వచ్చే వన్డే, టీ20 ప్రపంచ కప్ పోటీలకు జట్టును సిద్ధం చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు వారు తెలిపారు. ఫామ్ సరిగా లేనప్పటికీ ధోనీ స్థానంలో రిషబ్ పంత్ కు చోటు కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నామని ఎమెస్కే ప్రసాద్ చెప్పారు.

ప్రపంచ కప్ పోటీల తర్వాత తాను స్పష్టంగా ఉన్నానని, రిషబ్ పంత్ ను ముందుకు నెడుతున్నామని, ఇంకా కూడా అతన్ని బలపరుస్తామని, ఏ మేరకు ప్రగతి సాధిస్తాడనేది చూస్తామని ఎమెస్కే ప్రసాద్ చెప్పారు. తమ అంచనాల మేరకు పంత్ రాణించలేదనేది నిజమేనని, అయితే అయినా అతన్ని పరీక్షిస్తున్నామని, అతను రాణించగలడని ఆశిస్తున్నామని అన్నారు. 

ధోనీ విషయమే పదే పదే అడిగినప్పుడు కూడా ఎమెస్కే అదే చెప్పారు. ప్రపంచ కప్ తర్వాత తాము దోనీని పక్కన పెట్టి ఆలోచిస్తున్నామని ఇది వరకే స్పష్టం చేశానని, యువకులకు అవకాశం ఇస్తున్నామని, వారు ఏ మేరకు రాణిస్తారనేది పరిశీలిస్తున్నామని, పంత్ కు అవకాశం ఇస్తున్నామని, సంజూ శాంసన్ ను కూడా చూస్తామని అన్నారు. తమ ఆలోచనా ప్రక్రియను అర్థం చేసున్నారని అనుకుంటా అని మీడియా ప్రతినిధులతో అన్నారు. 

మీడియా ప్రతినిధులు ధోనీ భవితవ్యంపై పదే పదే ప్రశ్నించడం కొనసాగించారు. తిరిగి తిరిగి తాను అదే చెప్పదలుచుకోలేదని, పంత్ వంటి యువకులను తాము ప్రోత్సహిస్తామని అన్నారు. సెలెక్టర్ల మాదిరిగానే ధోనీ ఆలోచన చేస్తున్నాడని అనుకుంటున్నట్లు తెలిపారు. ధోనీతో మాట్లాడామని, యువకులను ప్రోత్సహించాలనే తమ ఆలోచనతో ఆయన ఏకీభవించారని ఎమెస్కే అన్నారు. 

ధోనీ పట్ల సెలెక్టర్లు చాలా స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. దాంతో బంతి ధోనీ కోర్టులోనే ఉన్నట్లు అర్థమవుతోంది. దేశవాళీ క్రికెట్ లో ఆడి తిరిగి ఫామ్ లోకి వస్తాడా, రిటైర్ అవుతారా అనేది ధోనీకే వదిలేశామని ప్రసాద్ చెప్పారు. భవిష్యత్తు కోసం పునర్వ్యస్థీకరణ ప్రక్రియను తాము ప్రారంభించామని కూడా చెప్పారు. 

ధోనీకి ఆ విషయాన్ని బిసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఎలా చేరవేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జట్టును పునర్వ్యస్థీకరించే ఆలోచనలో సెలెక్టర్లు ఉండడంతో ధోనీ తిరిగి జట్టులోకి రావడం సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. 

సెలెక్షన్ కమిటీ కొత్త చీఫ్ గా దిలీప్ వెంగ్ సర్కార్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు చీఫ్ గా వచ్చినా ధోనీకి తిరిగి అవకాశం లభించవచ్చునని భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios