అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన మహిళలను అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రంప్ వలస విధానాలు, సరిహద్దుల వద్ద పిల్లలను తల్లిదండ్రుల నుండి వేరు చేయటం, కుటుంబాలను విచ్ఛిన్నం చేయటం వంటి చర్యలపై హార్ట్ సెనేట్ ఆఫీస్ భవనం ముందు వందలాది మంది ఆందోళన కారులు నిరసన చేపట్టారు. జీరో టోలరెన్స్ పేరిట ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై వారంతా మండిపడ్డారు.

మొత్తం 47 రాష్ట్రాల నుంచి విమానాలు, బస్సుల ద్వారా వాషింగ్టన్ చేరుకున్న 500 మందికి మహిళలు అరెస్టుకు గురయ్యారు. ఇలా అరెస్టయిన వారిలో వాషింగ్టన్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఈ అరెస్టుపై ఆమె ట్విటర్లో స్పందించారు.

ఈ ర్యాలీలో అరెస్టయిన వారిలో తాను కూడా ఉన్నానని, మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారో తనకీ స్పష్టంగా తెలియదని, కానీ అందులో 500 మందికి పైగా మహిళలే ఉన్నారని అన్నారు. ఈ దేశంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన క్రూరమైన జీరో టాలరెన్స్ విధానంపై ఇకపై కొసాగబోదని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడతామనీ, ఈ నెల 30వ తేదీన మరోసారి రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తామని ఆమె చెప్పారు.