జబల్పూర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూరులో అమ్మాయిపై కామాంధులు విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు రెండు నెలలకు పైగా పదే పదే సామూహిక అత్యాచారం చేశారు. 

అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు గల ఐదగురు యువకులు తమ కూతురిపై అత్యాచారం చేశారని గోరక్ పూర్ పోలీసు సూపరింటిండెంట్ కు వారు ఫిర్యాదు చేశారు. 

రెండు రోజుల క్రితం అమ్మాయికి అబార్షన్ అయినట్లు ప్రచారం జరగడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఐదుగురులో సౌరబ్ చక్రవర్తి,త ప్రమోద్ చక్రవర్తి, హానీ చక్రవర్తి అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

మరో ఇద్దరు నిందితులు రాహుల్ చక్రవర్తి, బంటు సోంకర్ పరారీలో ఉన్నారు. తమ ఇంట్లో వంట చేయాలని నిందితుల్లో ఇద్దరు బాలికను అడిగారని, ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లి ఐదుగురు ఆమెపై అత్యాచారం చేశారని ఎస్పీ చెప్పారు. 

బాధితురాలి కుటుంబం ఓ మురికివాడలో జీవిస్తోంది. తల్లిదండ్రులు, సోదరుడు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. బాధితురాలికి అబార్షన్ చేసిన డాక్టర్ ను కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

కోర్టు అనుమతి లేకుండా అబార్షన్ చేయడం చట్టవ్యతిరేకమని, డాక్టర్ ను అరెస్టు చేస్తామని అధికారులు అంటున్నారు.