Womens Reservations: మహిళా రిజర్వేషన్లను ఇప్పుడే అమలు చేయాలని ఆదేశించలేం - సుప్రీంకోర్టు
మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పడం చాలా కష్టమైన పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పుడే అమలు చేయడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయని తెలిపింది.
Womens Reservations : చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇప్పుడే అమలు చేయాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జనాభా లెక్కల తర్వాత అమల్లోకి వస్తుందని చెబుతున్న మహిళా రిజర్వేషన్ చట్టంలోని కొంత భాగాన్ని రద్దు చేయడం చాలా కష్టమని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది.
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’(Nari Shakti Vandan Adhiniyam) 128వ రాజ్యాంగ (సవరణ) బిల్లును వెంటనే అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ పై నోటీసు ఇవ్వడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్ వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
పార్టీ ఆదేశిస్తే కర్ణాటక సీఎం కావడానికి సిద్ధమే - మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే
అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని, ఠాకూర్ పిటిషన్ ను నవంబర్ 22న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఠాకూర్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సమాచార సేకరణకు జనాభా గణన అవసరమని అర్థమవుతోందని, అయితే మహిళా రిజర్వేషన్ల విషయంలో జనాభా గణన ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందని న్యాయవాది ప్రశ్నించారు.
పాకిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. ఐదుగురు మృతి, 21 మందికి పైగా గాయాలు
జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని చెబుతున్న చట్టంలోని భాగం ఏకపక్షంగా ఉందని, దానిని కొట్టివేయాలని న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అలా చేయడం కోర్టుకు చాలా కష్టమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘మీ వాదన మాకు అర్థమైంది. (మహిళా రిజర్వేషన్ల కోసం) జనాభా గణన అవసరం లేదని మీరు చెబుతున్నారు. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ముందుగా సీట్లు, ఇతర అంశాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.