పార్టీ ఆదేశిస్తే కర్ణాటక సీఎం కావడానికి సిద్ధమే - మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే

హైకమాండ్ కోరితే తాను సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరిస్తానని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, ప్రియాంక్ ఖర్గే అన్నారు. ప్రస్తుతం కర్ణాటక ఐటీ మంత్రిగా ఉన్న ప్రియాంక్.. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Mallikarjun Kharge's son Priyank Kharge is ready to become the CM of Karnataka if the party orders..ISR

పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు తాను అంగీకరిస్తానని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తనను ముఖ్యమంత్రి కావాలని హైకమాండ్ ఆదేశిస్తే.. తప్పుకుండా దానికి ఒప్పుకుంటానని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ నిరాశగా ఉన్న బీజేపీ నాయకులు.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రూ.1,000 కోట్లు కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కోరారని అన్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ బృందం సంప్రదించిందని, వారు బీజేపీలోకి మారితే రూ.50 కోట్ల చొప్పున నగదు, మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గనిగ ఆరోపించిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలావుండగా.. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పూర్తి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతానని ఆయన గురువారం స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన తర్వాత నాయకత్వ మార్పుపై అధికార కాంగ్రెస్ లోని ఓ వర్గంలో ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి సారథ్యం వహిస్తారా ? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని మీడియా కోరగా.. ‘ఐదేళ్ల పాటు మా ప్రభుత్వం ఉంటుంది. నేనే ముఖ్యమంత్రిని, నేను కొనసాగుతాను.’ అన్నారు. 

కాగా.. ఈ ఏడాది మే 20న బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి ఆశించిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. అయితే రెండున్నరేళ్ల పదవి కాలం తరువాత డీకే శివ కుమార్ సీఎం అవుతారని ఆయన వర్గం చెప్పుకుంటోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios