దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాల వల్ల జరిగిన వివిధ ప్రమాదాల్లో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17 మంది చనిపోయారు.
దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లుల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించడం వంటి కారణాలతో 17 మంది మరణించారని ‘దక్కన్ క్రానికల్’ ఓ కథనంలో నివేదించింది. అనేక చోట్ల నదులు ఉప్పొంగడం, నీటి రిజర్వాయర్లు వేగంగా నిండిపోవడంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నిరంతరం కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, పలు చోట్ల రోడ్డు మార్గాలు దెబ్బతిన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పాల్ఘర్, పూణే నగరం, పొరుగున ఉన్న పింప్రి చించ్వాడ్ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు భారీ వర్ష సూచన కారణంగా గురువారం మూసివేశారు.
దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాలలో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల 14 మంది మృతి చెందారు. ఆయా ప్రాంతాల నుంచి ఈ సీజన్‌లో ఇప్పటివరకు 31,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కచ్, నవ్సారి, డాంగ్ జిల్లాల్లో మూడు జాతీయ రహదారులు దిగ్బంధానికి గురయ్యాయి 51 రాష్ట్ర రహదారులు, 400 పంచాయతీ రోడ్లు కూడా దెబ్బతిన్నాయని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి రాజేంద్ర త్రివేది తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్ల నీటి మట్టాలు కూడా పెరిగాయి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ జిల్లాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మళ్లీ కుండపోత.. అమర్‌నాథ్ యాత్రకు మరోసారి బ్రేక్ : ఐటీబీపీ
మహారాష్ట్రలో వర్షాలు విధ్వంసం సృష్టించాయి. పాల్ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి తండ్రీ కూతుర్లు మృతి చెందారు. గోండియా జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులలో నలుగురు కొట్టుకుపోయారు. పాల్ఘర్, గోండియా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాల్ఘర్‌లో కొండచరియలు విరిగిపడటంతో, వాఘ్రాల్‌పాడ పరిసరాల్లోని కనీసం 40 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చంద్రాపూర్ జిల్లాలో వరద ప్రవాహంలో మునిగిపోయిన వంతెనపై 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు చిక్కుకుపోయింది. దీంతో పోలీసు సిబ్బంది పెద్ద తాళ్లను ఉపయోగించి వారిని బయటకు తీశారు. భండారా జిల్లాలో వాయుంగంగా నది మధ్యలో ఉన్న ఆలయం వద్ద 15 మంది చిక్కుకుపోయారు. గురు పూర్ణిమ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు వారు ఆలయానికి వెళ్లారు.
పైన్ గంగా నది పొంగిపొర్లడంతో నాందేడ్ జిల్లాలో దాదాపు 200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా జిల్లాలోని 26 గ్రామాలకు రోడ్డు మార్గాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. గడ్చిరోలిలో కూడా గోదావరి, కాళేశ్వరం, ఇంద్రావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వైన్ గంగా, ప్రాణహిత, వార్ధా నదులు జిల్లాలో ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తుండటంతో 19 గ్రామాలకు చెందిన 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పెట్రోల్‌పై రూ. 5, డిజీల్‌పై రూ. 3 తగ్గింపు.. మహా సర్కార్ గుడ్ న్యూస్
కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు విధ్వంసం కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 32 మంది ప్రాణాలు కోల్పోయారని, దెబ్బతిన్న ప్రాథమిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి తక్షణమే రూ. 500 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. మల్నాడు, కోస్తా కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి, నదులు ఉప్పొంగి పారుతుండంతో అనేక ఆనకట్టలు నిండుకున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు, లోతట్టు ప్రాంతాలలో నీటమునిగాయి. శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఒడిశాలోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు అతాలకుతలం చేశాయి. గజపతి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కనీసం 10 ఇళ్ళు దెబ్బతిన్నాయి, మల్కన్‌గిరి, కలహండి జిల్లాల్లోని ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. రానున్న రెండు రోజుల్లో తొమ్మిది దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లాలోని మోటు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆరు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో మల్కన్‌గిరి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
