అమర్‌నాథ్ యాత్రకు మరోసారి బ్రేక్ పడింది. భారీ వర్షాల కారణంగా పహల్గాం, బల్లాల్ మార్గాల ద్వారా యాత్రికులను అనుమతించడం లేదని ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ తెలిపింది. 

ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌లో ఇటీవల ఊహించని వరదలతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇప్పటికీ అక్కడ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో యాత్రకు బ్రేక్ పడుతూనే వుంది. ఈ మేరకు ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) అధికారులు మాట్లాడుతూ... పహల్గాం, బల్లాల్ మార్గాల ద్వారా యాత్రికులను అనుమతించడం లేదని పేర్కొన్నారు. వర్షాలు తగ్గాక అప్పటి పరిస్ధితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

ఇకపోతే.. ఆకస్మిక వరదల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్రను మంగళవారం తిరిగి ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో 7,000 మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికులు మంగళవారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుండి బయలుదేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 7,107 మంది యాత్రికులతో కూడిన 13వ బ్యాచ్ కాశ్మీర్ లోయలోని పహల్గామ్, బల్తాల్ జంట బేస్ క్యాంపులకు రెండు వేర్వేరు కాన్వాయ్‌లలో 265 వాహనాల్లో బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3.40 గంటలకు బల్తాల్‌కు 98 వాహనాల్లో 1,949 మంది భక్తులు బయలుదేరగా, తెల్లవారుజామున 4.30 గంటలకు నున్వాన్-పహల్గాం బేస్ క్యాంపుకు 175 వాహనాల్లో 5,158 మంది యాత్రికులు బయలుదేరారు.

ALso Read:Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర మళ్లీ షురు.. జమ్మూ బేస్ క్యాంపు నుంచి 7000 మంది పయనం

దీనితో, జూన్ 29 నుండి ఇప్ప‌టివ‌ర‌కు 76,662 మంది యాత్రికులు భగవతి నగర్ బేస్ క్యాంపు నుండి లోయకు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి బ్యాచ్ యాత్రికులను జెండా ఊపి ప్రారంభించారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలోని 3,880 మీటర్ల ఎత్తైన గుహ పుణ్యక్షేత్రానికి 43 రోజుల సుదీర్ఘ యాత్ర జూన్ 30న జంట ట్రాక్‌ల నుండి ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సాంప్రదాయ 48-కిమీ నున్వాన్-పహల్గామ్ మార్గం, 14-కిమీ పొట్టి బల్తాల్, మధ్య కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా మ‌ధ్య యాత్ర కొన‌సాగ‌నుంది. ఇప్పటివరకు 1.20 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహ క్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్ట్ 11న రక్షా బంధన్‌తో పాటు 'శ్రావణ పూర్ణిమ' సందర్భంగా ఈ పాదయాత్ర ముగియనుంది.