ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మొదట కేరళలో విజింజం ఓడరేవును ప్రారంభించి అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు.  

Narendra Modi: దశాబ్దాలుగా కేరళ ఎదురుచూస్తున్న విజింజం ఓడరేవు శుక్రవారం ప్రారంభంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓడరేవును దేశానికి అంకితం చేస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో కేరళలో భారీ ఏర్పాట్లు చేసారు. 

గురువారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ రాత్రి తిరువనంతపురం చేరుకున్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. రాత్రి రాజ్ భవన్ లో మోదీ బస చేశారు.

శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ప్రధాని మోదీ రాజ్ భవన్ నుంచి విజింజంకు బయలుదేరుతారు. 10.15 గంటలకు వైమానిక దళ హెలికాప్టర్లో విజింజం ఓడరేవుకు చేరుకుంటారు. ఈ ఓడరేవును పరిశీలించిను దేశానికి అంకితం చేస్తారు... అనంతరం ప్రధాని ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరువనంతపురం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరుతారు.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఓడరేవు భద్రతపై ఎస్పీజీ బాధ్యతలు స్వీకరించింది. నగరమంతటా పోలీసులను మోహరించారు. సముద్రంలో తీర రక్షక దళం మరియు నౌకాదళం భద్రత కల్పిస్తున్నాయి. ఓడరేవు ప్రారంభోత్సవ కార్యక్రమానికి 10,000 మంది హాజరవుతారని అంచనా. తంబానూర్, కిజక్కేకోట్ట నుంచి విజింజంకు కెఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

ఉదయం 7 నుంచి 9.30 వరకు ముల్లూర్ లోని ఓడరేవు ద్వారం వద్ద ఉన్న రోడ్డు ద్వారా ప్రజలను అనుమతిస్తారు. ప్రధాన ద్వారం ద్వారా ప్రధాని మరియు ముఖ్యమంత్రి వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. విజింజం పరిసరాల్లో పార్కింగ్ కు పరిమితులు విధించారు.