ఉత్తరాఖండ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదనీటిలో ఓ కారు కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో నాలుగు రోజుల చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Viral Video : ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రమాదాలను సృష్టిస్తున్నారు. వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, నీటి కాలువలు, చెరువులు, వాగులు వంకలు తీవ్ర ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా కలిగిస్తున్నాయి. ఇలా తాజాగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలు నలుగురిని బలితీసుకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో ఏడుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న నీటి కాలువలో పడింది. అయితే కాలువ చిన్నదే అయినా అందులో నీటిప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయి ఓ కల్వర్టు కింద చిక్కుకుంది. వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై ఆ కారును కాలువలోంచి బయటకు తీశారు.
అయితే అప్పటికే కారులోని నాలుగురోజుల శిశువు సహా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు నీటి ప్రవాహంలో మునగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు... వారిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతున్నారు.
ఈ కారు వరదలో కొట్టుకుపోయి కల్వర్టు కింద చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారును బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుటున్నారు.
